Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటర్నెట్ లేకపోతే దానికి బానిసైనవాడి కంటే హీనంగా వుంటాడట...

ఈ రోజుల్లో ఇంటర్నెట్‌ గురించి తెలియనివారు లేదా ఇంటర్నెట్‌‌ను ఉపయోగించని వారు ఎంతమంది ఉన్నాము? వార్తలు చదవడానికో, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకో, ప్రయాణ టిక్కెట్ల కోసమో, ట్రాఫిక్ అప్డేట్ల కోసం... దీనికి దానికి అనే తేడా లేకుండా ఇంటర్నెట్‌‌ను అన్ని విధాల

Advertiesment
ఇంటర్నెట్ లేకపోతే దానికి బానిసైనవాడి కంటే హీనంగా వుంటాడట...
, గురువారం, 1 జూన్ 2017 (16:37 IST)
ఈ రోజుల్లో ఇంటర్నెట్‌ గురించి తెలియనివారు లేదా ఇంటర్నెట్‌‌ను ఉపయోగించని వారు ఎంతమంది ఉన్నాము? వార్తలు చదవడానికో, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకో, ప్రయాణ టిక్కెట్ల కోసమో, ట్రాఫిక్ అప్డేట్ల కోసం... దీనికి దానికి అనే తేడా లేకుండా ఇంటర్నెట్‌‌ను అన్ని విధాలుగా, అన్ని వేళల్లో.. పిసిలు, ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లలో ఎడాపెడా వయస్సుతో సంబంధం లేకుండా అందరమూ ఉపయోగించేస్తున్నాము. అంతగా టెక్నాలజీపై పట్టులేనివారు, కాస్తా వృద్ధులైనవారు తప్ప ఇంటర్నెట్‌ని ఉపయోగించనివారు, దానిపై ఆధారపడనివారు చాలా అరుదుగా ఉంటారు. కానీ ఇంటర్నెట్ అందుబాటులో లేని జీవితం గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి. ఏం?? ఊహించుకునేందుకు కూడా భయమేస్తోందా?
 
బ్రిటన్‌లోని ఒక యూనివర్శిటీ దీనిపై ఓ అధ్యయనం చేసింది. ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు మనిషిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడమే ఈ అధ్యయన ప్రధానోద్దేశ్యం. మాదకద్రవ్యాలకు బానిసై, అవి అందుబాటులో లేకపోతే ఆ వ్యక్తి అనుభవించే నరకానికి, ఇంటర్నెట్ అందుబాటులో లేని వ్యక్తి అనుభవించే బాధకు తేడా ఉండదు అంటున్నాయి ఈ అధ్యయన ఫలితాలు. వివరాల్లోకి వెళ్తే... 
 
సాధారణ ఆరోగ్యం చక్కగా ఉండి 18 నుండి 33 సంవత్సరాల్లోపు వ్యక్తులపై అధ్యయనం చేసిన ఈ విశ్వవిద్యాలయం ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు వీరిలో గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు 3 నుండి నాలుగు శాతం వరకు అధికమైపోవడం వంటి శారీరక మార్పులు సంభవించాయని తెలిపారు. ఇంతకాలం డిజిటల్ పరికరాలపై ఎక్కువగా ఆధారపడిన వ్యక్తుల్లో ఆ వస్తువులు అందుబాటులో లేనప్పుడు ఆందోళన మాత్రమే పెరిగేదని, కానీ ఇంటర్నెట్ అందుబాటులో లేని సందర్భాల్లో శారీరక మార్పులు కూడా సంభవిస్తున్నాయని తెలిపారు. 
 
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఇంటర్నెట్‌కు బానిసలైపోయామని లేదా ఎక్కువగా దాని ప్రభావానికి లోనవుతున్నామని మనకు కూడా తెలియకపోవడం. ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు మనలో సంభవించే మార్పుల కారణంగా ప్రాణాపాయం లేకపోయినప్పటికీ, అవి క్రమంగా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి. 
 
కాబట్టి మీ తీరిక సమయాన్ని కూడా ఇంటర్నెట్‌కు కేటాయించకుండా, కాస్తా మీ కుటుంబంతో గడపడం, ఇంటర్నెట్ అవసరంలేని కార్యకలాపాల్లో నిమగ్నమవడం వంటివి చేయడం ఉత్తమమని.. రోజురోజుకూ కనుమరుగైపోతున్న మానవసంబంధాలను తిరిగి పునరుద్ధరించుకోవడం ఇలాంటి చిన్న చర్యలతోనూ సాధ్యమేనని నిపుణులు తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే ఇది చేయండి..