ఉపోప్య ద్వాదశీం పుణ్యాం విష్ణు ఋక్షేణ సంయుతాం,
ఏకాదశ్యుద్భవం పుణ్యం నరః ప్రాప్నోత్యసంశయమ్ 2 (నారదోక్తి)
ద్వాదశి దినాన వామనమూర్తిగా విష్ణువు అవతరించిన తిథిగా పరిగణించబడుతోంది. ఈ ద్వాదశి రోజున ఉపవాసముండి విష్ణుమూర్తిని పూజచేసిన వారికి ఏకాదశి ఉపవాస పుణ్యం లభిస్తుందని నారద మహాముని పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
ద్వాదశి రోజున దేవేశ్వరాయ దేవాయ దేవసంభూతి కారిణే
ప్రభవే సర్వదేవానాం వామనాయ నమోనమః అని వామదేవుని నమస్కరించి,
నమస్తే పద్మనాభాయ నమస్తే జలశాయినే
తుభ్యమర్ఘ్యం ప్రయచ్ఛామి బాల వామనరూపిణే
నమశ్శార్ఞ ధనుర్బాణ-పాణయే వామనాయచ
యజ్ఞభుక్ ఫలదాత్ర చ వామనాయ నమోనమః
అనే శ్లోకమును స్తుతిస్తూ పితృదేవతలకు అర్ఘ్య ప్రదానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. ద్వాదశి రోజున శుచిగా స్నానమాచరించి నారాయణుడిని పూజించి, పితృదేవతలకు అర్ఘ్యమివ్వాలని వారు చెబుతున్నారు. ఈ రోజున విష్ణుపూజ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.