కార్తీకమాసం శివప్రీతికరమైనది. ఈ మాసం శివార్చన చేసిన వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఏ మంత్ర దీక్షను తీసుకున్నా గొప్ప ఫలితాలనిస్తుందని నమ్మకం. తులసి (పూసల) మాల ధరించడం, ఉసిరిక చెట్టును అర్చించడం కూడా శుభదాయకం.
అయితే కార్తీక నియమాన్ని పాటించేవారు ఇంగువ, ఉల్లి, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడి కాయ, చిక్కుడు, వెలగపండ్లను వంటల్లో చేర్చుకోకూడదు. అదే విధంగా మిగిలిన అన్నం, మాడన్నం, మినుములు, పెసలు, శెనగలు, ఉలవలను కూడా వాడకూడదు.
కార్తీక మాసంలో వచ్చే సప్తమినాడు ఉసిరిక, అష్టమినాడు కొబ్బరి, ఆదివారం ఉసిరికలను ఉపయోగించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
కార్తీకమాసమంతా కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం. పరమేశ్వరుడు "అశుతోషుడు" కాబట్టి భక్తులను తక్షణమే ఆదుకుంటాడని శాస్త్రాలు అంటున్నాయి. అందుచేత ఆయనను అలంకారాలు, నైవేద్యాలు, రాజోపచారాలతో మెప్పించడం కంటే... ఒక సారి "శివ" అని మరోసారి "శివ" అనే లోపలే ఆయన కరిగిపోతాడని విశ్వాసం.