Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరుంధతీ వ్రతం ఆచరించటం ఎలా?

వైధవ్యాన్ని నివారించే అరుంధతీవ్రతం

Advertiesment
అరుంధతి
, శనివారం, 28 జనవరి 2012 (15:51 IST)
File
FILE
చైత్రశుద్ధవిదియనాడు ఉమాశివాగ్నిపూజ చేయాలని స్మృతి కౌస్తుభం అనే వ్రత గ్రంథం పేర్కొంటోంది. ఈ రోజున ఉమాదేవి - శివుడు - అగ్నిదేవులను దమనము అనే సుగంధభరిత పత్రాలలో పూజలు చేసినవారికి వైధవ్యము సంప్రాప్తించదని, సంతానలేమితో బాధపడేవారికి కుమారస్వామివంటి కుమారుడు కలుగుతాడని కౌస్తుభం చెబుతోంది. కానీ, స్కందపురాణంలో చైత్ర శుద్ధ విదియనాడు అరుంధతీ వ్రతం చేయాలని ఉంది. చతుర్వర్గ చింతామణి ఈ పర్వదినాన నేత్ర ద్వితీయ వ్రతము, ప్రకృతి పురుష ద్వితీయా వ్రతాలను ఆచరించాలని చెబుతోంది. అయితే, ఈ పర్వదినాన ఉమాశివాగ్ని పూజయే ప్రధానంగా ఆచరింపబడుతున్నప్పటికీ, అరుంధతీ వ్రతం గురించి కూడ మన తెలుసుకోవల్సి ఉంది. సుమారు రెండు వేల సంవత్సరాలకిపైగా ఆచరింపబడుతూ వస్తున్న ఈ వ్రతం, వ్రత గ్రంథాల నుంచి హఠాత్తుగా అదృశ్యమై పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అర్వాచీనమైన అనేక ఇతిహాసాల్లో ఈ వ్రత ప్రాముఖ్యత విపులీకరించబడింది. జన్మజన్మల పర్యంతం వైధవ్యాన్ని నివారించమని కోరడమే ఈ వ్రతంలోని ప్రధాన ఉద్దేశం.

అరుంధతీ వ్రతం

చైత్ర శుద్ధ విదియనాడు అభ్యంగస్నానమాచరించి అరుంధతీ, ధ్రువ, వశిష్టమూర్తులను పసుపుతో దిద్దుకోవాలి. ఈ మూడు ముద్దలకు సాధారణ పూజానంతరం చలిమిడి, పరమాన్నాన్ని నైవేద్యం పెట్టి, ఏడుగురు ముత్తైదువులకు ఒక్కొక్కరికి ఏడు తమలపాకులు, ఐదు అరటిపళ్ళు, రెండు వక్కలు, ఎనిమిది గాజులు, ఒక రవికె గుడ్డను వాయనంగా సమర్పించి. ఆశీర్వాదాన్ని పొందాలి. అనంతరం ఈ క్రింది వ్రత కథను వారిచేత చదివించుకుని, శ్రద్ధగా వినాలి.

వ్రత కథ

పూర్వం కాశీనగరంలో నివసిస్తున్న సర్వశాస్త్ర బ్రహ్మ అనే విప్రుని కుమార్తె విధి వశాత్తూ బాల్యంలోనే వైధవ్యాన్ని పొందింది. భర్తను కోల్పోయిన ఆమె గంగ ఒడ్డున తపస్సు చేసి, పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రురాలై, మరుజన్మలో తనకు వైధవ్యం ప్రాప్తించకూడదని ఆది దంపతుల చేత వాగ్దానం చేయించుకుని తపస్సును నిలిపింది. అనంతరం ఆదిదంపతులిద్దరూ కైలాసం వెళుతున్న తరుణంలో, పార్వతి తన నాథుని నిలువరించి, ఆమెకు బాల్యంలోనే వైధవ్యం కలగడానికి గల కారణాన్ని వివరించమని కోరింది. పార్వతి కోరికను కాదనలేని పరమశివుడు ఆ బాలవితంతువు కథను ఇలా వివరించాడు.

ఆ బాలిక పేరు సుబల. సర్వశాస్త్ర బ్రహ్మ కుమార్తె అయిన సుబలను గుణనిధి అనే విప్రునికిచ్చి వివాహం జరిపించారు. విధి నిర్వహణ కోసం గుణనిధి దేశాంతరంవెళ్ళి, అన్యకారణాల వల్ల వేరొక స్త్రీ వ్యామోహంలో పడి, ఆమెను వివాహం చేసుకున్న కొన్ని నెలల లోపే చనిపోయాడు. స్వదేశంలో భార్యను వదిలి నందుకు, మొదటి భార్య జీవించి ఉండగా రెండవ స్త్రీని వివాహం చేసుకున్నందుకు, అతనికి అకాల మృత్యువు సంభవించింది. గుణనిధి అకాలమృత్యువు గురించి తెలియని సుబల, భర్త చేసిన తప్పుకు వైధవ్యాన్ని శిక్షగా పొందింది. కాలక్రమంలో ఆమెకు భర్త చేసిన అపరాధం తెలిసి, మరుజన్మలో తనకు తిరిగి వైధవ్యం కలుగరాదని మనలను కోరుతూ తపమాచరించి సఫలీకృతమైందని శివుడు పార్వతికి సుబల అకాల వైధవ్య చరితను వివరించాడు.

అరుంధతి విశిష్టత

చంద్రభాగా నదీ తీరంలో మేధాతి అనే మహర్షి పుష్కరకాలం పాటూ(12 సంవత్సరాలు) జ్యోతిష్టోమం అనే దీర్ఘయజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞవాటికనుంచి వికృతి - అరంజ్యోతి, అరుంథతి అంటూ బహునామములుగల ఒక స్త్రీ శిశువు జన్మించింది. (కానీ, పురాణచంద్రిక అనే గ్రంథంలో ఈమె కర్దముని కుమార్తెగా చెప్పబడింది.) అరుంథతి అనే పదానికి ఏ కారణం చేతనైనా ధర్మాన్ని అతిక్రమించనిదని అర్థం. ఉపనయన సమయంలో వటులకు గాయత్రీదేవి ఎటువంటిదో, వివాహసమయంలో వధువులకు అరుంధతీ దర్శనం అటువంటిది. వివాహంనాటి రాత్రులలో ఔపోసన అనంతరం వధువుకు ప్రత్యేకించి, అరుంధతీ నక్షత్రాన్ని, ఆమె పాతివ్రత్య నిష్టకు సంకేతంగా చూపిస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu