Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాయిబాబా మహిమ: మసీదులోనే కూర్చుని..?

Advertiesment
Saibaba preach
, బుధవారం, 16 జులై 2014 (18:01 IST)
సాయిబాబా దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేముందు బాబా అనుమతి తీసుకుని వెళ్ళేవారు. ఆయన సమ్మతిస్తేనే వెళ్ళాలి. బాబా గనుక ''ఇప్పుడు వద్దు'' అని చెప్పినా పట్టించుకోకుండా వెళ్తే.. కష్టాలు తప్పేవి కాదట. ఆయన మాటను తేలిగ్గా తీసుకుని వెళ్ళిన భక్తులకు ఏవో ఆటంకాలు కలిగి వెనుదిరిగి రావలసి వచ్చేది.
 
ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవారు. తన భక్తులు ఇబ్బందుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే కొన్నిసార్లు బాబా వారిని అడ్డగించేవారు. అది గ్రహించక ఏదో ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళి, కష్టనష్టాలు కొనితెచ్చుకునేవారు. అలా ఆపదలు ఎదురైనప్పుడు గానీ, బాబా ఎందుకు వద్దన్నారో గ్రహించేవారు కాదు.
 
సాయిబాబా మసీదులోనే కూర్చుని, ఎక్కడెక్కడ ఏం జరిగిందీ, ఏమి జరగబోతున్నదీ చక్కగా చెప్పేవారు. బాబా ఒక్కోసారి చిత్రవిచిత్రమైన సైగలు చేసేవారు. ఆ చేష్టలు ఒక్కోసారి ''పిచ్చి పకీరు'' అనిపించేలా ఉండేవి. బాబా ప్రవర్తన కొన్నిసార్లు భయపెట్టేలా కూడా ఉండేది. కానీ, వాటి వెనుక ఏదో గూఢార్ధం ఉండేది. కొద్దిసేపటికి బాబా శాంతించేవారు. భక్తులకు బాబా ఎందుకలా చేస్తున్నారో ఎంతమాత్రం అర్ధమయ్యేది కాదు. దూరాన ఉన్న భక్తులు ఆకస్మిక ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు, వారిని కాపాడే ప్రయత్నంలో బాబా అలా చిత్రంగా ప్రవర్తించేవారు. 
 
బాబా ఆ సంగతి చెప్పినప్పుడు పక్కనున్నవారికి ఆశ్చర్యంగానే ఉండేది. నమ్మశక్యం కానట్లు చూసేవారు. కానీ, కొద్దిసేపటికే తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన భక్తులను చూశాక, బాబా ఇక్కడే ఉండి, కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్న తీరు వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసేది. మసీదులో ఓ మూల కూర్చుని మహినంతటినీ చూడగల మహిమాన్వితుడు సాయిబాబా.
 
సాయిబాబాను చేరువగా చూసిన వారిలో కూడా అందరికీ ఆయన బోధనలు అర్ధమయ్యేవి కావు. బాబా మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించేవారు కాదు. కొందరు మాత్రమే బాబాను పరిపూర్ణంగా అర్ధం చేసుకుని తూచ తప్పకుండా అనుసరించేవారు. వారిని బాబా అనుక్షణం కనిపెట్టుకుని ఉండేవారు.

Share this Story:

Follow Webdunia telugu