Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాదరస ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి?

Advertiesment
Padarasa anjaneya swamy
, శనివారం, 5 జులై 2014 (17:25 IST)
త్రేతాయుగంలో ధర్మస్థాపన కొరకు విష్ణుమూర్తి, శ్రీరామచంద్రునిగా అవతరించాడు. మహాశివుడేమో ఆంజనేయునిగా అవతరించి, శ్రీరామునికి ప్రతి పనిలో, ప్రతి క్షణమూ సహకరించాడని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు అత్యంత బలవంతుడు.  తనను నమ్మిన భక్తులను ఆపదల నుండి రక్షించే దయాహృదయుడు.
 
ఆంజనేయుని ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు. ఆంజనేయుని ఇతర రూపాల కంటే పాదరస హనుమంతుని రూపం మరింత పవిత్రమైనది. మంగళవారం లేదా శనివారం హనుమంతునికి ప్రీతికరమైన రోజు కనుక ఆ రెండురోజుల్లో ఏదో ఒక రోజున పాదరస హనుమంతుని పూజించినట్లయితే శుభం కలుగుతుంది. అక్షయ తృతీయ కూడా పాదరస హనుమంతుని పూజకు శ్రేష్టమని పురోహితులు చెబుతున్నారు. 
 
పాదరస హనుమంతుడికి ఎలాంటి పూజ చేయాలంటే..?
పాదరస హనుమంతునికి పూజ చేద్దామనుకుంటే, ముందు రోజు రాత్రిపూట తలస్నానం చేయాలి. పూజకు సిద్ధం చేసుకున్న గదిని రాత్రి పూటంతా మూసి వుంచకండి. అలా తెరిచి ఉంచిన గది గడపమీద ఎర్రటి వస్త్రం పరచి, పాదరస హనుమంతుని ఉంచాలి. మనసులో భక్తిగా హనుమంతుని స్మరించుకోవాలి. ధ్యాన, ఆవాహనాది విధులతో పూజించాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి చదువుతూ, పూవులు, అక్షింతలు, సింధూరం జల్లుతూ భక్తిశ్రద్దలతో పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలు, తాంబూలం సమర్పించాలి. 
 
''ఓం నమో హనుమతే రుద్రావతరాయ
పరయంత్ర మంత్ర తంత్ర తాటక నాశకాయ 
సర్వ జ్వరచ్చేద కాయ, సర్వ వ్యాధి నికృంతకాయ
సర్వభయ ప్రశమనాయ, సర్వ దృష్టి ముఖ స్తంభనాయ
దేవ దానవ యక్ష రాక్షస భూతప్రేత పిశాచ
ఢాకినీ శాకినీ దుష్టగ్రహ బంధనాయ
సర్వ కార్య సిద్ధిప్రదాయ రామ దూతాయ స్వాహా..''
అనే మంత్రాన్ని జపించాలి.
మంత్రజపం ముగిసిన తర్వాత, క్షమామంత్రం చదివి, పూజలో ఉంచిన అక్షింతలు భక్తిగా తలపై జల్లుకోవాలి. పాదరస పూజ పూర్తయిన తర్వాత భోజనం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. 
 
గడప మీద ఉంచిన ఆంజనేయ విగ్రహాన్ని ఆ రాత్రి అలాగే ఉంచాలి. దీపం రాత్రంతా వెలుగుతూ ఉండాలన్న నియమం ఏమీ లేదు. ప్రమిదల్లో నూనె ఉన్నంతవరకూ వెలుగుతూ ఉంటాయి. ఇక మరుసటి రోజు మంగళవారం లేదా శనివారం లేదా అక్షయ తృతీయ అనుకోండి... ఆవేళ పొద్దున్నే లేచి, స్నానం చేసి ఆంజనేయుని ముందు దీపారాధన చేయాలి. ముందురోజు రాత్రి చేసినట్లే షోడశోపచారాలతో భక్తిగా పూజ చేయాలి. 
 
ఇంతకుముందు స్మరించిన 
''ఓం నమో హనుమతే రుద్రావతరాయ 
మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
ఏ దుష్ట శక్తులు మన దరికి చేరకూడదని, ఆపదలుండ కూడదని, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని భక్తిగా ప్రార్థించాలి. చివరికి శాంతి మంత్రాన్ని చదువుకోవాలి. పూజలోని అక్షింతలు శిరస్సుపై జల్లుకుని, ఆంజనేయునికి ఉద్వాసన చెప్పి, గడపపై నుండి ఆంజనేయుని విగ్రహాన్ని తొలగించి, పూజామందిరంలో ప్రతిష్టించుకోవాలి.
 
పాదరస ఆంజనేయుని విగ్రహాన్ని పూజా మందిరంలో స్థాపించిన రోజు నుండి, రోజూ చేసే నిత్య పూజ తర్వాత ఇందాక చెప్పుకున్న ''ఓం నమో హనుమతే రుద్రావతరాయ....'' మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపించుకోవాలి. ఇలా కనుక చేస్తే ఇక ఏ భయాలూ, భీతులూ మన చెంతకు రావు. మనసు నిబ్బరంగా ఉంటుంది. జీవనం సుఖంగా, సంతోషంగా గడుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu