సాధారణంగా.. తనకు కాబోయే భర్త మంచి గుణగణాలు కలిగి ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. పెళ్లయిన తర్వాత కూడా.. పరాయి స్త్రీతో సంబంధాన్ని వ్యతిరేకిస్తుంది. అయితే పురుషుడి మనస్తత్వం మాత్రం ఇందుకు పూర్తిభిన్నం. ఒక్కోసారి భార్య అతని అలవాట్లకు ముగ్ధురాలు అయిపోతే ఒక్కోసారి తల గోడకేసి బాదుకుందామా అనిపిస్తుంది. కొందరు భర్తల కొన్ని విచిత్రమైన ఈ అలవాట్లు ఎలా ఉంటాయో చూద్దాం.
* సాధారణంగా.. భార్యాభర్తలు ఎప్పటికీ మరిచిపోనిది.. వారి పెళ్ళి రోజు. కానీ.. పెళ్ళి, పుట్టిన రోజు సందర్భంగా విష్ చేయడాన్ని భర్తలు మరచిపోతారు.
* తమ భార్య కంటే.. ఇతరుల భార్యల్లోనే అన్ని మంచి లక్షణాలు కనిపిస్తాయి.
* పలువురి సమక్షంలో భార్య ఏదైనా మంచి సలహా ఇస్తే.. దాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తాడు. ఎందుకంటే.. అందరూ తనను భార్యదాసుడు అని అనుకుంటారనే భయం.
* తమ పిల్లలు చేసే ప్రతి మంచి పనిని తమదిగానే చెప్పుకుంటారు. అదే చెడు చేస్తే మాత్రం భార్యలపై రుద్దేందుకు ప్రయత్నిస్తారు.
* భార్యతో ఎప్పుడైనా బజారుకు వెళీతే తను భార్యకు ఎదో సహాయం చేస్తున్నట్టు ముఖం పెడతారు లేదా శిక్ష అనుభవిస్తునట్టు ఫీలవుతారు.
* భార్య మాత్రం ఎవరితోనూ సరదాగా, నవ్వుతూ మాట్లాడితే మాత్రం భర్త సహించలేడు. అదే తాను మాత్రం పరాయి స్త్రీతో షికారు చేయవచ్చు.
* తమ సరదాల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ భార్య విషయానికి వస్తే మాత్రం పైసలు ఖర్చు చేసేందుకు వెనుకంజ వేస్తారు.
* సాధారణంగా పురుషులు తమ స్వంత ఇంట్లోనే గెస్టుల్లా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఏ వస్తువు, సామాను ఉందో తెలియదు. తమ నిత్యావసర వస్తువులైన షేవింగ్ మెటీరియల్, చేతి రుమాలు, సాక్సులు, పెన్ను, టై ఇత్యాది వస్తువులను తీసుకునేందుకు సైతం తమ శ్రీమతులపై ఆధారపడుతారు.
* రాత్రి పిల్లవాడు పక్క తడిపితే చాలు.. భార్యను లేపడం మాత్రం తమ కర్తవ్యం అనుకుంటారు.
* పరాయి స్త్రీలు తమను పొగుడుతుంటే ఉబ్బి తబ్బిబ్బైపోతారు. అదే తమ భార్యల వంక పరాయి మగాడు చూస్తే మాత్రం చిరాకు పుట్టుకొస్తుంది.
* భార్యతో జుట్టుకు రంగు వేయించుకోవడం, తలకి నూనె రాయించుకోవడం, శరీర మర్ధన చేయించుకోవడం తమ జన్మహక్కుగా భావిస్తారు. భార్యకు నిజంగా తలనొప్పి వస్తే తలకు బాం రాయాడానికి మాత్రం వారి అహం అడ్డు వస్తుంది. పైగా టీ తాగు తగ్గిపోతుందని ఉచిత సలహా ఇస్తారు. ఆ చేత్తోనే నాకూ ఓ కప్పు కాఫీ ఇవ్వమంటారు.
* భార్య పుట్టింటి వాళ్ళు ఇంటికి వస్తే మనసు విప్పి మాట్లాడరు. కాని భార్య మాత్రం అత్తింటి వాళ్ళు వచ్చినప్పుడు పువ్వులాగా వికసించిన ముఖంతో అతిథి సత్కారాలలో చేయాలని భావిస్తారు. అలా చేయకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇలాంటి పురుషులెందరో ఉన్నారు.