కొందరు అప్పటిదాకా చలాకీగా ఉండి అకస్మాత్తుగా మౌనంగా కూర్చిండిపోతారు. మరికొందరు గతంలో ఎంతో సన్నిహితంగా ఉంటారో ఇప్పుడు వారినుండి అంతదూరమై పోవడమో, వారిని తప్పించుకు తిరగడమో చేస్తుంటారు. ఇలా ప్రవర్తించడాన్ని మానసిక శాస్త్రవేత్తలు "ఎమోషన్ ఇన్సులేషన్" అంటారు. ఇటువంటి మనస్తత్వం కలవారు తాము ఎంప్పటికీ ఒంటరిగా గడపాలని చూస్తుంటారు. నలుగురిలో ఉన్నా మనస్సు విప్పి మాట్లాడలేరు.
"ఎమోషన్ ఇన్సులేషన్" ఉన్నవారిలో వ్యక్తిత్వ వికాసం వుండకపోయినా కొన్ని పరిస్థితుల నుండి తమని తాము రక్షించుకుని తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. ఆ తాపత్రయంలోనే వారు తమ సన్నిహితులను కూడా దూరం చేసుకుంటారు. ఏది ఎలా మాట్లాడాలో, పెద్దవారితో ఎలా మసలుకోవాలో తెలియక మధనపడుతుంటారు. పెద్దవాళ్ళముందు మాట్లాడితే ఏమవుతుందో అనే భావనకు లోనవుతారు.
అంతేకాకుండా గతంలో తగిలిన ఎదురుదెబ్బలను, అపజయాలను తలచుకుని నిరంతరం నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. అయితే వర్తమానంగాని, భవిష్యత్తుగానీ గతం వలె నిరాశాజనకంగా వుండదని వారు గుర్తించరు. వర్తమానాన్ని గతంతో పోల్చుకుంటూ గడపడం వారి అపసవ్య మనస్తత్వాన్ని తెలియజేస్తుంది.