మగాళ్లతో మాట్లాడాలంటేనే భయం... ఎందుకని..?
సమాజంలో చాలామంది మహిళలు మగాళ్లతో మాట్లాడాలంటే చాలు... చాలా భయపడుతుంటారు. దీనికి కారణం కుటుంబ నేపధ్యం, పెరిగిన వాతావరణం, చదివిన స్కూలు, కాలేజీ లాంటి అనేక అంశాలుంటాయి. పురుషులతో మాట్లాడటానికి ఉండాల్సింది ఆత్మవిశ్వాసం. వాళ్లు ఎక్కడి నుంచో వేరే ప్రంపంచం నుంచి రాలేదనే విషయాన్ని గమనించాలి. ఆత్మ విశ్వాసం లేకపోవడం వల్లనే చాలామంది మహిళలే కాదు.. కొంతమంది పురుషులు కూడా మహిళలతో మాట్లాడేందుకు జంకుతుంటారు. ఇలా జంకుతూ తమకు దక్కాల్సిన వాటిని సైతం వదులుకుంటుంటారు.మహిళల విషయానికి వస్తే... తోటి మహిళతో ఎలా వ్యవహరిస్తారో అలాగే పురుషులతోనూ వ్యవహరిస్తే చాలు. స్నేహితురాలితో మాట్లాడేటపుడు ఎటువంటి జంకు లేకుండా మాట్లాడుతారు. కనుక అటువంటి ధోరణినినే పురుషుల అంశంలోనూ పాటించవచ్చు.ముఖ్యంగా మాట్లాడేటపుడు వాళ్లు ఆపోజిట్ సెక్స్‌కు చెందినవారనే భావన రానివ్వకూడదు. మనసులో ఆ ఫీలింగ్ ఉంటే సదరు మహిళ బాడీ లాంగ్వేజ్‌లో తేడా వస్తుంది. ఆ ఫీలింగ్ ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. దాంతో ఆ భయాలు ఎదుటివారికి తెలిసిపోతాయి. కాబట్టి పురుషులతో మాట్లాడే సందర్భాల్లో బిగుసుకుపోయి మాట్లాడకూడదు. ఈ ప్రపంచంలో మనుగడ కోసం కావాల్సిన ఆయుధాల్లో కమ్యూనికేషన్ ఒకటి. కాబట్టి ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడగలగాలి. పురుషులతో మాట్లాడటంలో జంకు ఉండేవారు తొలుత తమ అన్నయ్యలు, తమ్ముళ్లు వరస అయ్యేవారితో కలివిడిగా మాట్లాడటం ప్రారంభించాలి. ఇలా చేస్తూ పోతే కొంతకాలానికి బిడియం తగ్గి ఎవరితోనైనా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు.