ప్రేమకు మించిన శక్తి మరేదీ లేదు. ఎందుకంటే ప్రేమను పొందినవాడు భయవిముక్తుడవుతాడు. ఒక యువకుడు తన నవ వధువుతోబాటు సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. సూర్యాస్తమయం తర్వాత రాత్రి వేళ గాఢాంధకారం అలుముకుంది. ఉన్నట్టుండి తుఫాను ఊపందుకుంది.
వారితోబాటు ప్రయాణం చేస్తున్న ఇతర ప్రయాణీకులు భయంతో గజగజ వణుకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. ఓడ ఎప్పుడు మునుగుతుందో తెలియని పరిస్థితి. ప్రతి ఒక్కరు భయం గుప్పిట్లో మునిగి తేలుతున్నారు. కాని ఆ యువకుడు ఏ మాత్రం భయపడటం లేదు.
ఇంతటి ఘోరమైన ప్రమాదం సంభవిస్తున్నాకూడా మీకు ప్రాణాలమీద ప్రేమ లేదా..మీరెందుకు నిశ్చలంగా, భయం లేకుండా ఉండారని ఆ యువకుని భార్య అతడిని ప్రశ్నించింది. అప్పుడు ఆ యువకుడు తన ఒరలోనించి కత్తిని తీసి తన భార్య మెడ మీద ఉంచి నీకు భయమేస్తోందా అని అడిగాడు.
అప్పుడు ఆమె నవ్వుతూ ఇలా అనింది...ఏంటండీ మీరు మరీను...మీ చేతిలో కత్తి ఉంటే భయమెందుకు! దానికి ఆ యువకుడు ఇలా అన్నాడు...భగవంతుడున్నాడని నాకు నమ్మకం కలిగినప్పుడు భయమెందుకు పుడుతుంది.
ప్రేమ ఉన్న చోట భయం ఉండదు, ఎవరైతే భయంనుంచి విముక్తి కలగాలనుకుంటారో వారు ప్రేమను ఆస్వాదించాలి. చైతన్యంతో కూడుకున్న ప్రేమలో ధైర్యం అనేది పెరుగుతుంది. దీంతో భయం అనే రక్కసి పారిపోతుందంటున్నారు ఓషో. ఇందులో సమ్మోహన శక్తి ఉండటం మూలాన పిరికితనం, భయం అనేవి దరిచేరవంటున్నారు ఓషో.