పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే తల్లిదండ్రులు వారిని పూలకన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. కాని ఆదినుంచే పిల్లలపట్ల వివక్షత ప్రదర్శిస్తే వారి ఎదుగుదలలో పెద్దగా మార్పులుండవని మానసిక శాస్త్రజ్ఞలు అంటున్నారు. వారిలో సామాజిక భద్రత కరువవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం నేటి సమాజంలోని పిల్లలు మానసికమైన అనారోగ్యాలబారిన పడుతున్నారని లండన్‌కు చెందిన ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు డాక్టర్. సేరీ పావర్ అన్నారు. పిల్లల పెంపకం బాధ్యత కేవలం తల్లిదేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది చాలా తప్పు అని పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిరువురుకూడా బాధ్యులేనని ఆయన అభిప్రాయపడ్డారు.
తల్లిదండ్రులు చిన్నపిల్లల మానసిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలపై చూపే ప్రేమే వారి మానసిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వారితో ఎల్లప్పుడూ ప్రేమతో వ్యవహరిస్తూ, వారికి కావలసిన, అవసరమైన విషయాలగురించి వివరించాలంటున్నారు మానసిక వైద్య నిపుణులు.
తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో వారికి ప్రేమ పంచడంతోపాటు సామాజికపరిస్థితిపైకూడా అవగాహన కల్పించగలిగితే అలాంటి పిల్లలు మానసిక పరమైన జబ్బులబారిన పడరని నిపుణులు సూచిస్తున్నారు.