నా వల్లకాదులే అనుకోకండి.. మీరు సాధించగలరు..!!
క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని నావలాంటిది. విజయ సాధనకు కీలకమైనది క్రమశిక్షణే. అసలు క్రమశిక్షణ అనే పదాన్ని తమ జీవితంలో లేకుండా గడపేస్తుంటారు చాలామంది. అటువంటివారు అనుకున్నది సాధించడం 0%. అందుకే ఒక నిర్దిష్ట ఫలితాన్ని సాధించే దిశగా నిరంతర సాధనకు పురిగొల్పే స్వీయ నియంత్రణ విధానమైన క్రమశిక్షణను పాటించేవారు అనుకున్నది సాధించగలుగుతారు. ఇందుకు ఏం చేయాలీ... అంటే...మీ కాలాన్ని మీరు అదుపు చేయలేకపోతే, దానిని ఇతరులు ఆక్రమిస్తారు. ఫలితంగా మీరు వెనుకబడిపోతారు. కనుక మీరు తప్పనిసరిగా చేయవలసి ఉన్న పనుల జాబితాను సిద్ధం చేసుకోండి. అదే పనిగా వినోదం కోసం అర్రులు చాచకండి. ఖాళీ సమయాన్ని నిర్మాణాత్మకమైన పనులకు వినియోగించండి. అంతేకాని వినోదానికి కాదుసమయపాలన చెయ్యండి. ఒక క్రమమైన జీవితానికి అది సూచిక. సమయపాలన అంటే ఇతర వ్యక్తుల ప్రాముఖ్యాన్ని మన్నించడం. వారి కాలం విలువను గుర్తించడం అవుతుంది.మాట నిలుపుకోండి. వాగ్దానాలు చేసినప్పుడు వాటిని నెరవేర్చండి. కష్టమైన పనులు ముందు చేపట్టండి. తేలికైన, తక్కువ ప్రాధాన్యం కలిగిన పనులు చేసి, కష్టంగా ఉన్నవాటిని వదిలేస్తారు చాలామంది. దానివల్ల క్లిష్టమైన, అధిక ప్రాధాన్యంగల పనులను పూర్తి చేసేందుకు తగినంత శక్తీ, సమయమూ తర్వాత లేకుండా పోతాయి.విమర్శను స్వాగతించండి. మీరు చేయకూడనిది ఏమిటో తద్వారా తెలిసి అది మీ క్రమశిక్షణను పెంచేది అవుతుంది. కనుక జనాభిప్రాయాన్ని తిరస్కరించకుండా, సంతోషంగా ఆమోదించండి. త్యాగనిరతితో మెలగండి. మీరు అనుభవించదగినవే అయినప్పటికీ అప్పుడప్పుడయినా సరదాలు మానుకోండి.బాధ్యతలు స్వీకరించండి. చేయవలసిన పనులను చేసేందుకు సంసిద్ధులుకండి. అలాంటి బాధ్యతల్ని నిర్వర్తించేందుకు మీకు తగిన సమయం ఉండేలా తప్పనిసరిగా మలచుకుంటుంది మీ జీవితం. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకండి. అది మీకు సాయపడదు. ప్రస్తుతానికి మీరెక్కడున్నారో చూసుకోండి. జీవన గమనంలో మరింత మెరుగ్గా అయ్యేందుకు యత్నించండి. ఒక స్థాయికి చేరుకున్నాక, దాని పైస్థాయికి వెళ్లేందుకు యత్నించండి. అంతిమ లక్ష్యాన్ని అందుకునేంతవరకూ అదే పద్ధతిని కొనసాగిస్తూ పొండి. అలా అంచెలంచెలుగా ఎదిగిన కొద్దీ ప్రతిసారీ మీరు మరింత శక్తిసంపన్నులవుతారు. ప్రతి అవకాశాన్ని అంటిపెట్టుకుని ఒక సవాలు ఉంటుందన్న విషయాన్ని గుర్తెరిగి ఉండాలి. కొందరు ఈ సవాళ్లను విజయ సోపానాలుగా భావిస్తారు. అటువంటివారికి విజయం తథ్యం.