Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవ్వితే, నవ్విస్తే ఒత్తిడి మటుమాయం...

Advertiesment
నవ్వితే, నవ్విస్తే ఒత్తిడి మటుమాయం...

Raju

, సోమవారం, 8 సెప్టెంబరు 2008 (15:38 IST)
వ్యక్తులుగా నవ్వడం, నవ్వక పోవడం, చిటపడలాడటం మన ఇష్టం.. కానీ సదా నవ్వుతుండటం, ఎదుటివారిని నవ్విస్తూండటం వంటి లక్షణాలు కలిగినవారిని పరికించి చూస్తే పరమప్రశాంతంగా ఉంటారు. అందరూ నవ్వుల జల్లులు కురిపించాలని ఆశించడం మాత్రం అత్యాశే అవుతుంది. అయితే పని సంబంధాల్లో మాత్రం నవ్వేవారికి, నవ్వించేవారికి ప్రాధాన్యత పెరుగుతూండటం గమనార్హం.

నవ్వడం, నవ్వించడం, సరదాగా ఉండటం, జోకులు పేల్చడం వంటి లక్షణాలు ఆఫీసు వాతావరణాన్ని తేలిక చేస్తాయని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పనిచేసే చోట వాతావరణం ఆహ్లాదంగా, సరదాగా ఉంటే ఎంతో లాభమని అధ్యయన కర్తలు వెల్లడించారు.

ఆఫీసులో ఎంత పనిభారం ఉన్నా అప్పుడప్పుడూ జోకులు వేసుకుంటూ, నవ్వుకోవడం వల్ల ప్రతి ఒక్కరిలో ఒత్తిడి దూరం అవుతుంది. సహోద్యోగుల మధ్య చక్కటి సంబంధాలు ఏర్పడటానికి, పనితీరు మెరుగు పర్చుకోవడానికి, దీనిద్వారా ఉత్పాదకతను పెంచడానికి హాస్యప్రవృత్తి బాగా దోహదం చేస్తుంది. ఇది ఉద్యోగుల్లో సృజనాత్మకతను కూడా పెంచుతుంది.

నవ్వడం, నవ్వించడం, నవ్వుకోవడం ఉన్న వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేసుకోగలుగుతారు. మనందరికీ తెలుసు.. సాధారణ ఉద్యోగులు తమ పనిభారాన్ని, దాని తాలూకూ ఒత్తిడిని కుటుంబ సభ్యులపై ప్రదర్శిస్తారు. ఈ ప్రవృత్తికి భిన్నంగా ఆఫీసులో సరదాగా ఉండేవారు ఇంటి వద్ద కూడా అదే ధోరణిని ప్రదర్శిస్తారు.

ఒక్కటి మాత్రం నిజం.. ఇంట్లోని సమస్యలను ఆఫీసు వరకు తీసుకొచ్చేవారు పనిచేసే చోట కూడా అంతే చిరాగ్గా ఉంటారు. ఇలాంటి వారు పనిలో పూర్తి సామర్థ్యతను ప్రదర్శించలేరు. అందుకే ఆఫీసు వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంచేందుకు అందరూ సరదాగా ఉండాలని మనస్తత్వ నిపుణులు సలహా ఇస్తున్నారు.

పైగా, మనస్తత్వ శాస్త్రం ప్రకారం నవ్వనివారు, సరదాగా ఉండలేని వారు, తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు అటుంచి లక్ష్యసాధన విషయంలో కూడా ఇతరులకు ప్రేరణ ఇవ్వలేరట. ముఖారవిందం నుంచి ఒక చల్లటి చిరునవ్వును ప్రసాదిస్తే చాలు రాజ్యాన్నే నీ పాదాక్రాంతం చేస్తానని వెనకటికి ఓ చక్రవర్తి తన ప్రియురాలితో పలికిన పలుకులు మనకు తెలుసు..

నిజం... చిరునవ్వులో మహత్తు ఉంది. మనుషులను నిత్య ఉత్సాహితులను చేసే మంత్ర శక్తి చిరునవ్వుకే ఉంది...
అందుకే.. నవ్వండి.. నవ్వించండి.. ఇవి ఆధునిక పర్సనాలిటీకి వెలలేని ఆభరణాలు....

Share this Story:

Follow Webdunia telugu