Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్వరగా ఎదగాలనే తపనతో బాలికలకు చిక్కులు

Advertiesment
త్వరగా ఎదగాలనే తపనతో బాలికలకు చిక్కులు
, మంగళవారం, 15 జులై 2008 (19:49 IST)
త్వరగా ఎదగాలనే తపనతో, ఆరాటంతో బాలికలపై పడుతున్న సామాజిక ఒత్తిళ్ల కారణంగా వారి మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటోందని ఓ తాజా అధ్యయనం తెలిపింది. పత్రికల్లో, వెబ్‌సైట్లలో కనిపించే సమాచారం, లైంగిక భావనలు వంటివాటి ప్రభావానికి బాలికలు గురవుతుండటంతో వారిలో ఆహార పద్ధతుల్లో తీవ్ర మార్పులు, దూకుడుతనం, స్వీయ హాని వంటి దుర్లక్షణాలు పెరుగుతున్నాయని ఈ అధ్యయనం హెచ్చరించింది.

గర్ల్ గైడింగ్ యుకె మరియు మెంటల్ హెల్త్ ఫౌండేషన్ సోమవారం విడుదల చేసిన అధ్యయనం ప్రకారం మేగజైన్లు, వెబ్‌సైట్లు వంటి వాటిలో బాలికలు చూస్తున్న దృశ్యాలు, చదువుతున్న విషయం వారిలో తీవ్రమైన ఒత్తిడిని కలుగ జేస్తున్నాయని తేలింది. ఎ జనరేషన్ అండర్ స్ట్రెస్ అనే శీర్షికతో ఉన్న ఈ అధ్యయన నివేదిక లండన్ బాలికల్లో పెరుగుతున్న మానసిక దుష్ప్రభావాల తీవ్రతకు అద్దం పట్టింది.

పత్రికల్లో, వెబ్‌సైట్లలో కనిపించే మోడల్స్, పాప్ స్టార్స్ మరియు నటీమణులను చూసేకొద్ది లండన్ బాలికలు తమను తాము కించపర్చుకోవడం ఎక్కువవుతోందట. సన్నగా ఉండాలని, రివటల్లాంటి శరీరాలను రూపొదించుకోవాలని ఈ పత్రికలు, వెబ్‌సైట్లు సూచిస్తుండటంతో బాలికలు ఈ లక్ష్యసాధన కోసం మాదకద్రవ్యాలను వాడుతున్నారని, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంటున్నారని అధ్యయనం తెలిపింది.

ఆన్‌లైన్ సర్వే నుంచి సాగించిన ఈ అధ్యయనం ప్రకారం పదేళ్ల వయసు కలిగిన లండన్ బాలికలు తాము త్వరగా ఎదగాలనే ఒత్తిడికి తీవ్రంగా గురవుతున్నారని తెలుస్తోంది. ఇది ఏ స్థాయికి పోతోందంటే బాలికలు తాము యువతులుగా, తమ వయసును మించి తమను ప్రదర్శించే రకం దుస్తులను వాడు కోవాలని ప్రయత్నిస్తున్నారు. అంటే టీనేజ్ కూడా లేని బాలికలు టీనేజ్ యువతులకు పట్టే దుస్తులను ధరించాలనే యావను కలిగి ఉంటున్నారు.

మెంటల్ హెల్త్ ఫౌండేషన్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఆండ్రూ మెకుల్లోచ్ ఈ విషయమై మాట్లాడుతూ, పెద్దలుగా మనం సృష్టించిన సమాజంలోబాలికలు, యువతులు, అసహజరీతిలో త్వరగా ఎదిగిపోవాలనే ఒత్తడికి గురవుతున్నారని చెప్పారు. ఈ ఒత్తిడి వారి భావోద్వేగ స్థితికి హాని కలిగిస్తోందని చెప్పారు.

అతి త్వరగా తాము శారీరకంగా ఎదిగిపోవాలనే తపనకు, ఆతృతకు బాలికలు, యువతులు గురవుతున్నారని, తమ ప్రవర్తనను నిర్దేశిస్తున్న ఆదర్శ నమూనా మహిళలు వీరిలో ఒత్తిడిని ఆందోళనను పెంచుతున్నారని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధక విద్యార్థులు చెప్పారు. తాము ఆరాధిస్తున్న వారి శారీరక ప్రమాణాలను తాము సాధించలేదన్న అనుభూతికి వీరు లోనయ్యారంటే తామిక పనికిరామనే న్యూనతా భావానికి గురవుతున్నారని గర్ల్‌గైడింగ్ యుకె ట్రస్టీ ట్రేసీ ముర్రే చెప్పారు.

వయోపరిపక్వత లేకుండానే లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం, వ్యాపార సంస్కృతి పాలబడటం, ఒత్తిడితో తప్పతాగడం వంటి దుష్రభావాలకు గురవుతున్న బ్రిటన్ బాలికలు కొత్త తరం మానసిక ఆరోగ్య సమస్యలకు పాల్పడుతున్నారని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇది చివరకు కుటుంబాల విచ్ఛిత్తికి కూడా దారితీస్తోందని నివేదిక తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu