అతి చిన్న వయసులో ప్రేమ..అంటే టీనేజ్ లవ్ అఫైర్. ఇలాంటి ప్రేమ ప్రతి ఒక్కరికి కలుగుతుంటుంది. ఈ వయస్సులో ముందు..వెనుకా చూడరు. ఆ వయసులో కలిగే ప్రేమే శాశ్వతం, అదే జీవితం అని అనుకుంటుంటారు.
టీనేజ్‌లో కలిగే ప్రేమలో ఇరువురూ భావుకులైపోతుంటారు. ఆ భావుకత ఎలా ఉంటుందంటే వారు ఊహించిందే నిజమైన ప్రేమగా, తమ ప్రేమకు కారకులైన వారే వారి జీవిత భాగస్వామిగా ఊహించుకుని వారికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. ఇలాంటి సందర్భంలో వారిమధ్య ఎవరైనా మూడోవ్యక్తి వారి ప్రేమకు అడ్డుపుల్ల వేసేవారే వారికి ప్రథమ శత్రువులు. అది వారి తల్లిదండ్రులు, అన్నా- చెల్లెళ్లు, లేదా వారి నిజమైన స్నేహితులుకూడా కావచ్చు.
టీనేజ్ ప్రేమలో మునిగితేలియాడుతుండే యువతకు తమ ప్రేమ మాత్రమే కనపడుతుంటుంది. అలాంటి సందర్భంలో వారికి ప్రపంచమంతా ప్రేమ ద్వేషిగానే కనపడుతుంటుంది. ఇలాంటి సందర్భంలో వారు ఇంకాస్త ముందుకు వెళ్ళి ప్రేమ వివాహం చేసుకుని ఆ తర్వాత చాలా ఇబ్బందులకు గురౌతుంటారు.
గుజరాత్‌లోని పోర్‌బందర్ పట్టణంలో జరిగిన యదార్థ సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నాను.
పోర్‌బందర్లో ఉంటున్న జాగృతి(17) అనే అమ్మాయి, అఖిలేష్ అనే వివాహితునితో ప్రేమలో పడింది. తమ అమ్మాయి వివాహితునితో ప్రేమలో పడిందని, అతనికే కట్టబెట్టాలని ఏ తల్లిదండ్రులుకూడా అంగీకరించరు.
జాగృతి తల్లిదండ్రులు దీనిని విరోధించారు. కానీ ప్రేమోన్మాదంలో మునిగి తేలియాడుతున్న ఆ అమ్మాయి ఏదో ఒక విధంగా అతన్ని పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుంది. దీంతో తన తల్లిదండ్రులున్నంత వరకు అఖిలేష్‌తో వివాహం జరగదని భావించి తన ప్రేమికునితో కలిసి అమాయకులైన తల్లిదండ్రులిరువురిని హతమార్చింది.
ప్రేమలో మునిగిపోయిన జాగృతి చివరికి తన తోబుట్టువులైన ఇద్దరు సోదరులను కూడా హతమార్చింది. వారిలో ఒకడు మృతి చెందగా మరో తమ్మడు మూర్ఛపోవడంతో అతను బ్రతికి బయట పడ్డాడు. ప్రస్తుతం జాగృతి మరియు ఆమె ప్రేమికుడు ఊచలు లెక్కపెడుతున్నారు. తప్పు చేసానని, ఇప్పుడు తాను పశ్చాత్తాపపడుతున్నట్లు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపింది.
తన 17 సంవత్సరాల వయసులో ప్రేమోన్మాదంలో మునిగిపోవడంతో తాను చేస్తున్నదేంటి అనే విషయం తనకు తెలియరాలేదని, తాను చేసేది తప్పని కాస్త తెలిసివుంటే ఇంతటి ఘోరానికి పాల్పడి ఉండేదాన్ని కాదని జాగృతి అభిప్రాయపడింది. తన సోదరులకు రాఖీలను కట్టిన ఈ చేతులతోనే తాను హతమార్చానని ఆవేదన వ్యక్తం చేసింది.
జాగృతి దారి తప్పింది. సరే.. ఆమెకంటే సరైన దారిని చూపే వారు కరువైనారనుకుందాం. కాని మీకు తెలిసిన వారెవరైనాకూడా లేదా మీ సంతానం టీనేజ్‌లో ఉండి చెడు మార్గంలో పయనిస్తుంటే వారిని మీరు సరైన మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీకు కొన్ని సూచనలు ఇవ్వదలచుకున్నాను. దీంతో "టీనేజ్ లవ్ అఫైర్" ఎప్పుడు భయానక పరిస్థితికి చేరుకుంటుందనేది అవగతమౌతుంది.
** మీ టీనేజ్ పిల్లలు తమ పూర్తి సమయాన్ని వారి ఫ్రెండ్స్‌తో కాకుండా మరెవరితోనైనాకూడా గడుపుతున్నారేమో మీరు కనిపెట్టి ఉండాలి. ** ఎల్లప్పుడూకూడా తమను తాము ఒంటరిగా గడపాలని కోరుకుంటుంటే లేదా వారు ఒంటరిగా తమ గదిలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ తమలో తామే కుమిలిపోతున్నారేమో గమనించాలి. ** తదేకంగా ఫోన్లలో సంభాషిస్తున్నారా..ఇంటర్నెట్‌లో చాటింగ్ చేస్తున్నారా అనే విషయాన్ని మీరు గమనిస్తుండాలి.** మీ మాటను పెడచెవిన పెట్టకుండా ఉన్నారా..!** రాత్రిపూట ఇంటికి చాలా ఆలస్యంగా వస్తున్నారా గమనించండి.ఒకవేళ మీ సంతానం అతి చిన్న వయసులోనే ప్రేమలో పడితే మీరు జాగ్రత్త పడాలి. మీ టీనేజర్ల ప్రేమతోబాటు మీకు ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది. వీటిని నివారించడానికి ఉపాయాలు..** మీ టీనేజ్ పిల్లలు ప్రేమలో పడితే వారిని మీరు దగ్గరకు తీసుకుని వారితో ప్రేమగా మాట్లాడండి. ఆ ప్రేమ వ్యవహారం వారికి చాలా ప్రమాదకరంగా మారొచ్చనే విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పండి. ** మీ కుమారుడు లేదా కుమార్తె ప్రతి రోజూ వారు ఏం చేస్తున్నారనే విషయాన్ని వారి మిత్రులను అడిగి తెలుసుకుంటుండండి. ** మీ సంతానం టెలిఫోన్‌లో లేదా ఇంటర్నెట్‌లో ఎవరితో, ఎంతసేపు సంభాషిస్తున్నారోకూడా మీరు కాస్త గమనించాల్సివుంటుంది. ** రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తుంటే వారు ఎక్కడ గడుపుతున్నారో, ఎవరితో ఉంటున్నారో అనే విషయాన్నికూడా తెలుసుకోవలసి ఉంటుంది. ** వారితో మాట్లాడేటప్పుడు వారి సంబాషణకు మధ్యలో అడ్డుపడకండి. ప్రేమించడం తప్పుకాదు. ప్రేమలో పడ్డ వ్యక్తి మాత్రమే తమ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించారని పరిశోధకులు తెలిపారు. అదికూడా వారు సరైన వయసులో ప్రేమించి తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారని విశ్లేషకులు తెలిపారు.