Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోపానికి విరుగుడు...

Advertiesment
కోపానికి విరుగుడు...

Raju

, శనివారం, 21 జూన్ 2008 (20:23 IST)
కోపం ప్రమాదకారి అనేది అందరికీ తెలిసిన విషయమే.. కోపం రాకూడదనేది ఎంత మంచి కోరికో, కోపం ఎవరికైనా ఎప్పుడైనా వస్తుందనేది కూడా అంతే వాస్తవం. అందులోనూ అరిషడ్వర్గాల్లో కోపాన్ని కూడా చేర్చారు. గదా. అసలు పురాణాల్లో మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. స్తితప్రజ్ఞత గురించి, శాంతమూర్తిత్వం గురించి పదే పదే రాజులకు బోధ చేసే మహర్షులు, బ్రహ్రర్షులు సైతం క్రోధావేశాన్ని అదుపులో ఉంచుకోలేక ఇక్కట్ల పాలవడం, సమాజాన్ని ఇబ్బంది పెట్టడం గురించి చాలానే చదువుకున్నాం.

కాబట్టి తన కోపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష అంటూ హితబోధలు చేయడం కంటే కోపం ప్రతిఒక్కరికీ వస్తుందన్న గ్రహింపుతో ఉంటే దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకోవచ్చు.

కోపం ఎందుకొస్తుంది. ?
మనుషులుగా మనందరికీ చాలా సార్లు చాలా విషయాల మీద కోపం వస్తూంటుంది. దీనికి కారణాలు ఎన్నో.. ఎన్నెన్నో.. మనం కోరుకున్నది దొరక్కపోవడం. ఇష్టమైనది జరగకపోవడం, ఇష్టం లేనిది జరగటం, మాటకు మాట అందివ్వడం, చెప్పిన మాటలను ధిక్కరించడం.. అంచనాలు తప్పిపోవడం..

ఇలా ఒకటేమిటి.. కోప కారణాలు సవాలక్ష. అయితే కోపం రావడానికి గల కారణాలను అన్వేషించకుంటే మనకు కోపం తెప్పించిన పరిస్థితులను గురించి కూడా ఆలోచిస్తే మనం చిరాకు పరాకులను, మాట దూకుడుతనాన్ని కాస్తంతయినా అదుపులో ఉంచుకోవచ్చు.

కోపం వస్తే...
కొందరు కోపం వస్తే తమలో తాము బాధపడిపోయి గింజుకుంటారు. ఇంకా తగ్గకపోతే భోజనం మాని తమను తాము హింసించుకుంటారు. అయితే ఇలాంటి ప్రవర్తన వల్ల మీ కోపం వచ్చిందన్న సంగతి ఇతరులకు అర్థం కాక పోగా, కుటుంబీకులు బంధువులు, మిత్రులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది.

ఒకవేళ అర్థమైనా మీ వైఖరికి అలవాటు పడిపోయి సరేలెమ్మని వదిలేస్తారు. ఇది మీకు మరింత ప్రమాదకరం అవుతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు దానికి కారకులైన వారి వద్దకు పోయి, మీ బాధను మీ ఆగ్రహాన్ని బయటపెట్టి అడిగేస్తే సగం బాధ తీరిపోతుంది. వారి సమాధానం మీ అంచనాకు భిన్నంగా ఉంటే... మీ కోప కారణమే తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది.

అలాగని కోపం వచ్చినప్పుడు కోపం తెప్పించిన వారితో మాట్లాడకుండా, చూడకుండా ఉంటే కాసేపటికి కోపం పోతుంది. అలాకాక, కోపం తెప్పించిన వారి గురించి ఇతరుల దగ్గర మాట్లాడితే మరికొన్నిసమస్యలు ఎదురవుతాయి. అందుకే కోపంతో ఉన్నప్పుడు దాని గురించి పరాయి వారి దగ్గర మాట్లాడే కన్నా మౌనంగా ఉంటే ఎంతో మంచిది.

కోపానికి పరిష్కారం...
కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం. ఒక్కోసారి కోపంలో ఏం మాట్లాడుతున్నామో మనకే అర్ధం కాదు. అందుకే కోపం వచ్చినప్పుడు ప్రతి మాటకు ముందు రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి.

కోపానికి అతిసులువైన విరుగుడు అంకెలను లెక్కపెట్టడమే. కోపం వస్తే ధీర్ఘంగా శ్వాసిస్తూ ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెడితే క్రమంగా కోపం తగ్గిపోతుంది.

ఆత్మన్యూనత భావం కలవారు ప్రతి విషయానికి కోపం తెచ్చుకుంటారు. ఇందువల్ల ఏ ప్రయోజనం లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు పరిష్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే.

కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా మనుషులకు పిలువకుండానే కోపం వస్తుంది. ముఖ్యంగా ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి కోపిష్టులపై సానుభూతి చూపి మంచి మాటలతో ఊరడించాలి.

ఈ సారి ఎప్పుడైనా మీకు కోపం వస్తే.. అద్దంలో మొహం చూసుకోండి. కోపంలో మీ హావభావాలు ఎంత వికృతంగా ఉంటాయంటే.. వాటిని అద్దంలో చూస్తేచాలు... మరోసారి మీకు కోపం రమ్మన్నా రాదు.

Share this Story:

Follow Webdunia telugu