Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"కాస్త నవ్వితే నీ సొమ్మేంపోతుంది...!"

Advertiesment
, సోమవారం, 28 జులై 2008 (19:09 IST)
FileFILE
ఈ భూప్రపంచంలో ఉన్న అనంతకోటి జీవరాశులలోనూ మానవుడు ఒక్కడే నవ్వడం నేర్చినవాడు. నవ్వు మనిషికి దేవుడిచ్చిన అపురూపమైన వరం. మన శరీరంలో ఉన్న ఉత్సాహపు బ్యాటరీలను తిరిగీ తిరిగీ భర్తీ చేయగలిగిన శక్తి ఒకే ఒక్క నవ్వుకుంది. పట్టరాని సంతోషం కలిగినప్పుడు, ఉత్సాహభరితులం అయినప్పుడు, లేదా ఇతరులకు మన సంతోషాన్ని ప్రకటించాలను కున్నప్పుడు మనం నవ్వుతాం.

మన ఆత్మీయులకు బహుమతిగా ఇచ్చే నవ్వును స్వీకరించేందుకు ఎవరు మొహమాటపడతారు చెప్పండి. పైగా ఇలాంటి మరిన్ని కానుకలు తీసుకునేందుకు ముందుకొస్తారు. ఇలా ఇచ్చే వారిని అభిమానిస్తారు, పెద్దవారైతే ఆశీర్వదిస్తారు. ఈ సృష్టిలో నవ్వడం చేతకానివారంటూ ఎవరూ ఉండరు. నిత్యజీవితంలోనే కాకుండా అన్ని వృత్తులలోనూ ఇది అవసరమైన విద్య.
నవ్వితే నవరత్నాలు...!
  పగలబడి నవ్వడమే నవ్వు కాదు. ఎదుటి వ్యక్తిని పలకరింపుగా నవ్వే ఒకే ఒక్క చిరునవ్వు చాలు మనం ఎదుటపడ్డ ప్రతిసారీ ఆ వ్యక్తి మనపట్ల అభిమానాన్ని ప్రకటించడానికి. మనం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటేనే లోకం మన నవ్వుతో శ్రుతి కలుపుతుంది.      


హాయిగా, ఆహ్లాదంగా నవ్వడం వేరు, వృత్తిరీత్యా నవ్వడం వేరు. వృత్తిరీత్యా నవ్వే నవ్వు తెచ్చిపెట్టుకున్నదైనప్పటికీ ఆ వృత్తికి గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుంది. "కాస్తంత నవ్వితే నీ సొమ్మేంపోతుంది" అని ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవాళ్ళని వారి ఆత్మీయులు అనడం పరిపాటి. నిజంగానే నవ్వితే పోయే సొమ్మేమీ లేదు. పైగా నవ్వడం వల్ల వచ్చే ఆరోగ్యమనే ఆస్తిపాస్తులు తప్ప..!

పగలబడి నవ్వడమే నవ్వు కాదు. ఎదుటి వ్యక్తిని పలకరింపుగా నవ్వే ఒకే ఒక్క చిరునవ్వు చాలు మనం ఎదుటపడ్డ ప్రతిసారీ ఆ వ్యక్తి మనపట్ల అభిమానాన్ని ప్రకటించడానికి. మనం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటేనే లోకం మన నవ్వుతో శ్రుతి కలుపుతుంది. మన బాధలు, కష్టాలు చెప్పడం ప్రారంభిస్తే ఎవ్వరూ మన దగ్గరికి చేరరు. దుఖాన్ని ఒంటరిగానే అనుభవించడం శ్రేయస్కరం.

మనకి ఎన్ని దుఃఖాలు దుఖాలు ఎన్నున్నా ఎదుటవారి ముందు బయటపెట్టకుండా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే.. మన దుఃఖాలను ఎప్పటికైనా గ్రహించిన మన ఎదుటివారు మనం అడక్కుండానే ప్రతిస్పందిస్తారు. మనం కాదన్నా మన కష్టాల్లో పాలుపంచుకుంటారు. నవ్వుకు అంత శక్తి ఉంది మరి!.

మనకు సంతోషాన్ని పెంచి, మనస్సును ప్రశాంతపరిచి, నాడీ మండలానికి కాస్తంత సేదనిచ్చే నవ్వు మన ప్రమేయం లేకుండానే మనం తీసుకునే ఓ శక్తివంతమైన టానిక్. ఈ టానిక్ మన కార్యదక్షతను పెంచటమే గాకుండా, మనలోని వ్యతిరేక ఆలోచనలను బయటికి వెళ్లగొడుతుంది. సహజసిద్ధమైన నవ్వు సంబంధాలను దృఢతరం చేస్తుంది. చేపట్టిన పనిని ఎంత త్వరగా పూర్తిచేద్దామా అని కాకుండా, ఎంత సరదాగా చేద్దామా అనుకుంటూ చేస్తే ఆ పని మనం అనుకున్న దానికంటే త్వరగా పూర్తవుతుంది. ఈ సరదానే నవ్వు.

ఈ సందర్భంగా మనం ఆస్కార్ వైల్డ్ కొటేషన్‌ను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే... "నవ్వని రోజే మనం పూర్తిగా కోల్పోయిన రోజు అవుతుంది" అన్నారాయన. సమస్త జీవకోటిలో మనిషికి మాత్రమే అలంకారమైన నవ్వును బలవంతంగా ఆపుకోవద్దు. భళ్ళున నవ్వడమే ఆరోగ్యకరమన్న సత్యాన్ని మరువవద్దు.

పబ్లిసిటీ అవసరం ఎంతమాత్రమూ లేని నవరత్నాలను పైసా ఖర్చులేకుండా అందించే ఒకే ఒక్క సూత్రమే "నవ్వు". ఎంత అనారోగ్యమున్నా, ఎన్నెన్ని బాధలున్నా నవ్వుతూ కొన్నిటిని మరచిపోవచ్చు. కొన్ని అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అంతెందుకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఆయుర్దాయాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే "నవ్వితే నవ రత్నాలు" అన్నారు పెద్దలు. నవరత్నాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్న నవ్వు అంటే ఇష్టపడని వారెవరుంటారు ఈ భూప్రపంచంలో....! :))

Share this Story:

Follow Webdunia telugu