Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈర్ష్య హద్దు మీరితే ప్రమాదకారి...!

Advertiesment
ఈర్ష్య హద్దు మీరితే ప్రమాదకారి...!
, శనివారం, 27 సెప్టెంబరు 2008 (18:43 IST)
FileFILE
అంతులేని ప్రేమలో అంతు చిక్కకుండా దాగి ఉంటుంది ఈర్ష్య. ఇది లేని మనిషి ప్రపంచంలో ఉండరు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక మూల ఎంతో కొంత మోతాదులో నక్కి ఉండే ఈ భావనను ముందుగానే గుర్తించగలిగితే దాని తాలూకు ప్రభావం మనలోని ప్రేమ భావాన్ని అంటకుండా జాగ్రత్త పడవచ్చు.

ఇంతకూ.. ఈర్ష్య ఎందుకు కలుగుతుంది? అంటే అభద్రతా భావననే వెలెత్తి చూపాలి. మనం ఎవరినయినా లేదా దేన్నయినా అమితంగా ఇష్టపడుతున్నప్పుడు, వారి చుట్టూ మన ఆలోచనలు అల్లుకుని దాని ప్రకారం మన జీవితాన్ని తీర్చి దిద్దుకుంటున్నప్పుడు ఏ చిన్న అవాంతరం వచ్చి దాన్ని కదిలించివేస్తుందో అనే అభద్రతా భావం నుంచే ఈర్ష్య పుడుతుంది.
  అన్నిటి కంటే ముఖ్యంగా ఎవరిమీదైనా మనకు ఈర్ష్య ఇప్పటికే ఏర్పడిపోయిందేమో మనలోకి మనమే తరచి చూసుకోవాలి. అలాంటిది ఉంటే శషభిషలు లేకుండా ఈర్ష్యకు లోనయ్యామనే విషయాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే దీన్నుంచి త్వరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది.      


ఈర్ష్య మనసులో ఏర్పడినప్పుడు మానసిక ప్రవర్తన విపరీత పోకడలు పోతూ ఉంటుంది. ఇది వెంటాడుతున్నప్పుడు కొంతమంది ఎవరికీ ఏమీ చెప్పరు. తమలో తామే కుమిలిపోతుంటారు. నిస్సహాయంగా ఉంటారు. కొంతమంది తమకు కలిగిన చిన్న సౌకర్యానికి కూడా నెపం అవతలి వాళ్లపై నెట్టేస్తుంటారు.

ఇంకా తమను ఎవరో మోసం చేస్తున్నారని ఫీలవుతూ అరచి గోల చేయడం, అకారణంగా వాదనలోకి దిగటం, పరుషంగా మాట్లాడటం,
బాధపెట్టినవారిని తామూ బాధించాలని శాడిస్టిక్‌గా తయారవ్వటం వంటి స్వభావాలను ప్రదర్శిస్తుంటారు. ఇది మరీ శృతి మించినట్లయితే ఇతరులను అవమానించడం, మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలవ్వటం, పరాయి సంబంధాలను ఆశ్రయించడం కూడా జరగటం కద్దు.

అందుకే .. మన ప్రేమను తొక్కేసి, అభద్రతను పుట్టించి, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి చివరకు జీవతంలో మనను ఏకాకిని చేసే ఈర్ష్యను మనం పూర్తిగా అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇందుకు కొన్ని అంశాలను పరిశీలిద్దాం.

అన్నిటి కంటే ముఖ్యమైనది మనలో ఎవరిమీదైనా, దేనిమీదైనా ఈర్ష్య ఇప్పటికే ఏర్పడిపోయిందేమో మనలోకి మనమే తరచి చూసుకోవాలి. అలాంటిది ఉంటే శషభిషలు లేకుండా ఈర్ష్యకు లోనయ్యామనే విషయాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే దీన్నుంచి త్వరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది.

బలవంతంగా అవతలవారి నుంచి ఏదీ లాక్కోలేమనే విషయాన్ని గ్రహించాలి. ఈ గ్రహింపు మనిషికి చాలా అవసరం.

ప్రపంచంలో ఎవరూ ఎవరి అధీనంలోనూ ఉండరని గ్రహించాలి. భార్యాభర్తలైనా సరే ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుందని ముందుగా గుర్తించాలి.

ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటి భావాలు మనలో ఏర్పడుతున్నాయంటే మనలో ఏదో లోపం ఉందని అర్థం. మనలో తప్పు జరగబోతోందనేదానికి ఇదొక సంకేతం మరి. అసూయ ఏర్పడినప్పుడు అవతలివాళ్లకేసి చూపడం కాకుండా మన బాధ్యత ఎంత ఉందో తరచి చూడాలి.

అసూయ అనేది ఒక సాధారణమైన ఉద్వేగ స్థితి. ఎవరి పట్ల మనకు ప్రేమ ఎక్కువగా ఉంటుందో వారి పట్ల ఈర్ష్య కూడా ఉంటుంది. ఇది మనలోని అసలు ప్రేమను ఆక్రమించుకోకుండా ఉన్నంతవరకు మనం ఏమీ కోల్పోకుండా ఉంటాము. ప్రేమించే వాళ్లనుంచి ఇంకా రెట్టింపు ప్రేమను గౌరవాన్ని పొందగలగాలంటే మనం ఈర్ష్యను జయించాలి. ఇదొక్కటే పరిష్కారం..

Share this Story:

Follow Webdunia telugu