మగవాడికి సమానంగా తాము కూడా రాణించే రోజులు వచ్చాయని ఆధునిక మహిళా సమాజం గర్వపడటంలో తప్పు లేదు. బానిస బతుకులు బతికిన మహిళల (తల్లుల) కృషి కారణంగానే నేటి ఆధునిక మహిళా సమాజం ఈ స్థాయికి చేరిందనడంలో సందేహం లేదు.
తాను అనుభవించే కష్టాలు తన కుమార్తెకు రాకూడదని ఆమెను పట్టభద్రురాలు చేయడంలో, విదేశీ చదువులను అందించడంలో, ఎన్ని రకాల కళలు నేర్చుకోవాలో అన్నిటినీ నేర్చుకోవడంలో తల్లి పాత్ర అసమానమైంది.
ప్రస్తుత కార్యాలయ వాతావరణంలో ఆధునిక మహిళా సమాజం ఆకాశమే హద్దుగా పయనిస్తోంది. అందులో ఏ మాత్రమూ సందేహం లేదు.
అయితే కుటుంబ వాతావరణంలో వీరిలో ఎందరు మహిళలు విజయం సాధించగలరో చెప్పగలమా? ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఏ స్థాయికి ఎదిగినా ఏదో ఓ రోజు కుటుంబ బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుందిగా.
అందుకు వారు సిద్ధంగా ఉన్నారా అని అడిగితే చాలావరకు నెగటివ్ సమాధానాలే వస్తాయి. అందులోనూ పట్టణ యువతుల నుంచి అయితే దాదాపుగా అంతకు మించి ఎదురు చూడటం చాలా కష్టం.
వంటపని కాదు కదా కనీసం ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం కూడా వీరికి తెలియదు. తమ కుమార్తెకు వంట పని అస్సలు తెలీదు అని గర్వంగా చెప్పుకుంటున్న తల్లులను చూస్తున్నామంటే దీనికంతటికీ మూలం ఎక్కడుందో బోధపడగలదు.
మన పిల్లలను బాగా చదివించి, ఉన్నత స్థితిలో చూసుకోవాలనుకోవడం తప్పు కాదు కానీ వారిని పూర్తి స్థాయి మహిళగా తీర్చిదిద్దే విషయంలో నిర్లక్ష్యం చేయడం వారి భవిష్యత్తుకు అంత మంచిది కాదనే విషయాన్ని కూడా గుర్తెరగాలి.