Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీతం చేతికందగానే రెచ్చిపోయి షాపింగ్ చేస్తున్నారా?

Advertiesment
జీతం చేతికందగానే రెచ్చిపోయి షాపింగ్ చేస్తున్నారా?
, సోమవారం, 8 సెప్టెంబరు 2014 (18:47 IST)
ప్రతి వ్యక్తికి నెలసరి ఖర్చు ఉంటుంది. అదే విధంగా నెలసరి ఆదాయం ఉంటుంది. నెలజీతం అందుకోగానే రెచ్చిపోయి అప్పటికప్పుడు కనిపించినవన్నీ కొనేసి షాపింగ్ బ్యాగులు పట్టుకుని ఇంటికి చేరేవారికి నెల చివరిలో చిక్కులు తప్పవు. 
 
ఆదాయం, ఖర్చుకు సంబంధించిన అంచనా జీతం అందుకునేందుకు ముందే చేతిలో ఉండాలి. నెలవారి చెల్లించాల్సిన వాటిని కాగితం మీద రాసుకోవాలి. ఇంటి అద్దె, పచారీ సామాన్లు, పిల్లల స్కూల్ ఫీజులు, బస్ పాస్‌లు, పని మనిషి జీతం వంటివన్నీ ప్రతినెలా తప్పనిసరిగా ఉండేవి. 
 
కరెంట్, టెలిఫోన్ బిల్స్ వంటి వాటిని కలుపుకుని ఇంకా అదనంగా కొంత డబ్బు జత కలిపి నెలకు తప్పకుండా అవసరమయ్యే ఖర్చు ఎంతో లెక్క తేల్చాలి. ఆ లెక్క ప్రకారం మీ జీతంలో నుండి డబ్బును తీసి ఒక కవర్‌లో విడిగా పెట్టి ఉంచండి. 
 
అనుకోని ఖర్చులు కొన్ని వస్తుంటాయి. ఆరోగ్యం కోసం, దుస్తుల కోసం, బంధుమిత్రులు వచ్చినప్పుడయ్యే ఖర్చువంటివన్నీ అదనపు ఖర్చులు. ఇలాంటి ఖర్చు నెలలో సరాసరిన ఎంతుంటుందో మీకు తెలిసే వుంటుంది. ఆ మేరకు డబ్బును తీసి మరో కవర్‌లో పెట్టండి. 
 
ఈ రెండు ఖర్చులు పోగా మిగిలిన డబ్బును మూడో కవర్‌లో పెట్టి బీరువాలో భద్రంగా దాచండి. ఎంతో అవసరమైతే తప్పించి మూడో కవర్ తెరవనని మనసులో శపధం చేసుకోండి. ఇటువంటి శపధం అమలుకు ఒకటి రెండు నెలలు శతవిధాలా ప్రయత్నిస్తే ఇక ఆ తర్వాత అదే అలవాటవుతుంది. ఇలా చేస్తే ప్రతి నెలా కొంత డబ్బు తప్పకుండా ఆదా అవుతుంది. 
 
కవర్లలో డబ్బు పెట్టి ఉంచడంతో పాటుగా దినవారి లెక్క తప్పదు. ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రోజు చేసిన ఖర్చును కాగితం మీద లేదా ఒక పుస్తకంలో రాసుకోవటం ద్వారా నెల చివరిలో ఖర్చు విషయంలో స్పష్టత ఏర్పడుతుంది. ఏ అంశం మీద ఎక్కువ ఖర్చు అవుతున్నది. ఎక్కడ దుబారా జరిగింది. ఏ అంశం మీద ఆదా చేయవచ్చు అనేది అంచనా వేసుకునేందుకు ఈ లెక్కలు పనికొస్తాయి. ఈ లెక్కలను బట్టి మరుసటి నెల బడ్జెట్‌లో మార్పులను చేసుకునేందుకు వీలుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu