హౌస్‌వైప్‌గా ఇంట్లోనే ఉండిపోయామే అని కొందరు ఆడవాళ్లు బాధపడడం వింటూనే ఉంటాం. కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం కోసం కొందరు ఆడవాళ్లు చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంట్లోనే ఉండిపోతుంటారు. అలాంటివారికి కాలగమనంలో తాము హౌస్‌వైప్‌గా ఉండడం వల్ల ఏదో కోల్పోయామనే చింత వేధిస్తుంటుంది.
అయితే ఇలా ఎప్పుడైనా అనిపిస్తే ఫర్వాలేదు కానీ ఎప్పుడూ అదే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడితే మాత్రం అనారోగ్యం కలిగే అవకాశముంది. ఇంట్లోనే ఉన్నామనే చింతతో బాధపడే మహిళలు మానసిక అనారోగ్యానికి సైతం గురయ్యే అవకాశముంది. అయితే ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే గృహిణిగా ఉండడం వల్ల మహిళలు కోల్పోయేదేమీ లేదని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎందుకంటే ఉద్యోగానికి వెళ్లలేకపోయామని గృహిణిలుగా ఉన్నవారు ఎంతలా బాధపడుతుంటారో అదే స్థాయిలో ఉద్యోగానికి వెళ్లే మహిళలు కుటుంబాన్ని చూచుకోలేకపోతున్నామని బాధపడుతుంటారని వారు చెబుతున్నారు. అందుకే ఉద్యోగాన్ని వదిలి గృహిణిగా ఉన్నవారు ఆ విషయం గురించి అంతలా బాధపడాల్సినపని లేదని వారి అభిప్రాయం.
గృహిణిగా ఉండి తన కుటుంబం బాగోగులు చూచుకుంటే భవిష్యత్‌లో కుటుంబ సభ్యులు ఉన్నతస్థానానికి చేరుకుంటే ఆ గొప్పతనం ఆ ఇంటి గృహిణిదే. అలాకాక ఉద్యోగం పేరుతో కుటుంబాన్ని వదిలేస్తే భవిష్యత్‌లో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అందుకే గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించే మహిళలు ఉద్యోగం చేసే మహిళలకు ఏ విషయంలోనూ తీసిపోరన్నది మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం.
అంతేకాకుండా ఉద్యోగిగా సంస్థను నిర్వర్తించడం ఎంత కష్టమో కుటుంబ సభ్యల గురించి తెలుసుకుని వారికి అన్నీ సమకూరుస్తూ వారి అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయడం అంత సులభమైన పనేమీకాదు. అందుకే గృహిణి అనే ఉద్యోగం నిర్వర్తించే మహిళలు గొప్ప ఉద్యోగం నిర్వర్తిస్తున్నట్టే.
భర్త జీతం ఇంటి అవసరాలకు సరిపోతున్నప్పుడు ఇంట్లోని పిల్లల యోగ క్షేమాలను తెలుసుకొనే సమయం లేనంతగా ఉండే ఉద్యోగ నిర్వహణతో చివరకు సాధించేదేమీలేదు. కాబట్టి ఆర్ధికంగా ఇబ్బందిలేనపుడు, గృహిణిగా ఇంట్లో విషయాలు చూసుకోవాల్సి వస్తే మాత్రం ఉద్యోగం కంటే గృహిణిగా ఉండడమే శ్రేయస్కరం.
దీనివల్ల పిల్లల బాగోగులను దగ్గరుండి చూసుకోవచ్చు. అందువల్ల పిల్లల భవిష్యత్‌ను చక్కని మార్గంలో నడిపించే అవకాశం కల్గుతుంది. ఉద్యోగం చేసి సంపాదించి ఆ డబ్బుతో పనివారిచేత ఇంటిని సంరక్షించుకోవడం కన్నా తామే స్వయంగా కుటుంబాన్ని చూచుకోవడం ఓ మధురానుభవం కూడా.
కాబట్టి గృహిణిగా ఇంట్లో ఉండే మహిళలు ఉద్యోగం చేసేవారికన్నా ఏ విషయంలోనూ తీసిపోరనే విషయాన్ని గుర్తించాలి. అలాగే గృహిణిగా ఉండడం కష్టం కాదు ఇష్టం అన్న దృష్టితో ఆలోచిస్తే ఉద్యోగిగా కంటే గృహిణిగా మరింత ఎక్కువ ఆనందాన్ని అనుభవించవచ్చు.