ప్రేమించిన యువకుడు తీరా పెళ్లి దాకా వచ్చేసరికి కాదని మొహం తిప్పేసుకుంటే జీవితమే కూలిపోయిందనుకునే భావనలు యువతుల జీవితాల్లో శైశవదశను ప్రతిబింబిస్తాయి. సమస్యలను ఎదుర్కొనే మానసిక స్థైర్యం, పరిణతి లోపించినప్పుడే తిరస్కరణను సహించలేక స్త్రీలయితే అఘాయిత్యాలకు పాల్పడడం.. పురుషులయితే అంతం చూస్తామంటూ కత్తులు పట్టుకోవడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటుంది. ఇలాంటి విపరీత ప్రవర్తనలకు చాలా కారణాలు. ఏదీ ప్రధానమని చెప్పలేం కూడా. జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏదీ లేకపోవడం, మితిమీరిన పొసిసివినెస్, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోవడం ఇలాంటి అనేక కారణాలు మానసిక వైపరీత్యాలకు కారణమవుతుంటాయి.సినిమాటిక్ ప్రేమల ఫలితం.. |
|
ఇష్టపడిన అమ్మాయి దక్కలేదని పొడిచేయడం, పరీక్ష తప్పామని ఆత్మహత్యలకు పాల్పడడం వంటివి జీవితాన్ని సినిమాటిక్‌గా అర్థం చేసుకోవడం నుంచే వస్తుంటాయి. అనుకున్నది ఎలాగైనా సాధించడం సినిమాల్లోనే జరుగుతుంది. ప్రేమించడం తేలికే కాని దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం... |
|
|
తిరస్కారానికి గురైన వ్యక్తులు స్పందించే తీరు కూడా విభిన్నంగా ఉంటోంది. బాధ తట్టుకోలేక తమను తాము హిసించుకునే వారు కొందరు, ఇక జీవితంలో ఎందుకూ పనికిరామని ఫీలై కుమిలిపోవడం, వేరుమార్గం లేదని చెప్పి దుర్వ్యవసనాలకు గురికావడం, వాటి సాకుతో ఇతరులను సాధించడం, వ్యంగ్యంగా మాట్లాడటం, హేళన చేయడం, అవమానించడం చేస్తుంటారు.
కొందరయితే ఈ స్థాయిని కూడా దాటిపోయి అవతలి వారిని హింసించడం, ఎమోషనల్‌గా భయపెట్టడం, వారి పరోక్షంలో చెడుగా మాట్లాడటం, నేరుగా హాని తలపెట్టడం, చివరకు చంపేందుకు కూడా సిద్ధపడటం... ఇవన్నీ మనిషిలోని విపరీత ప్రవర్తన కిందికే వస్తాయి. శైశవదశలోనే ఎక్కువగా బయట పడే ఇలాంటి లక్షణాలను తొలి దశలోనే గుర్తించి మానసిక నిపుణులను సంప్రదించడం చాలా అవసరం.
ఇలా విపరీత మనస్తత్వం బయటపడిన వ్యక్తుల ఆలోచనలను సైకాలజిస్టులు దారి మళ్లించి సానుకూల శక్తిని నింపేలా చేస్తారు. కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అనే ఈ సిస్టం వల్ల జీవితంలో అల్పాతి అల్పమైన అంశాలకు ప్రాధాన్యత తగ్గి ఆలోచనల స్థాయి పెరుగుతుంది. చిన్న చిన్న వాటికి అతిగా స్పదించండి తగ్గుతుంది. అందుకని విపరీత మనస్తత్వం, అసాధారణ ప్రవర్తనలు పిల్లల్లో యువతీయువకుల్లో కనబడినప్పుడు ఏమాత్రం జాగుచేయకండా మనస్తత్వ శాస్త్రవేత్తల వద్దకు కౌన్సెలింగ్ కోసం తీసుకుపోవడానికి తటపటాయించవద్దు.