వారాహి దేవి.. శ్రీ మహావిష్ణువు అంశం. భైరవ పత్నీ. అలాంటి వారాహి దేవిని స్తుతిస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయని ఉపాసకులు అంటున్నారు. ఆమెను కొలిచేవారికి సర్వం సిద్ధిస్తుందని వారు నొక్కి చెప్తున్నారు. ఇంట వారాహి దేవి పూజను చేసే వారికి ఇక జీవితంలో ఎలాంటి లోటు వుండదని చెప్తున్నారు.
ముఖ్యంగా అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. వరాహి దేవికి ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. వారాహి దేవిని ఏ రోజైనా పూజించవచ్చు. ఈ పరిహారాన్ని ఏడు రోజుల పాటు వరుసగా చేస్తే నెరవేరని కోరికంటూ వుండదని వారాహి దేవి ఉపాసకులు అంటున్నారు.
అదెలాగంటే.. వారాహి దేవిని స్తుతించి.. ఆ రోజు ఇంటిల్లాపాదిని శుభ్రం చేసుకుని, పూజగదిని శుభ్రం చేసుకుని.. పూజకు పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. సంధ్యాపూజను ముగించుకోవాలి. తర్వాత రాత్రి పది గంటల నుంచి 11 గంటల వరకు ఈ పరిహారాన్ని చేయాలి.
ఓ గాజు పాత్రలో గుప్పెడు రాళ్ల ఉప్పు, తొమ్మిది మిరియాలను వుంచాలి. ఆపై తొడిమ తీసిన తమలపాకును వుంచాలి. ఈ బౌల్‌ను వారాహి దేవి ముందు వుంచి.. ఆమె ముందు స్వచ్ఛమైన నేతితో ప్రమిదలో దీపం వెలిగించాలి. ఇలా ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు నేతి దీపం వెలిగించాలి.
ఉప్పును, మిరియాలను ఏడురోజులకు మార్చాల్సిన అవసరం లేదు. అయితే తమలపాకు వాడిపోతే మాత్రం దానిని తీసి కొత్తది వుంచవచ్చు. ఆ ఆకును చెట్ల వేర్ల వద్ద వేసేయడం చేయాలి.
ఇలా ఏడు రోజుల పాటు చేసిన తర్వాత తప్పకుండా భక్తులు కోరిన కోరికలను వారాహి దేవి నెరవేరుస్తుందని విశ్వాసం. ఈ ఉప్పును, మిరియాలను ఏడు రోజులు పూర్తి చేసాక.. చెట్ల మొదట్లో వేసేయాలి. ఇలా ఏడు రోజులు చేస్తే.. తప్పకుండా పాటిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.