కార్తీకమాసానికి ప్రత్యేకత వుంది. శివకేశవులకు కార్తీక మాసం ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఉపవాసం చేసి.. రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే.
అలాగే కొన్ని రోజులకు విశేష ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి.
ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.
ఈ మాసంలో శివునికి రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరపడం మంచిది. ఉపవాసం, స్నానం, దానం మరవకూడదు. అలాగే విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి.
రోజూ ఇంటి ముంగిట దీపం వెలిగించడం.. ఆలయానికి వెళ్లి దీపం వెలిగిస్తే పుణ్యఫలం చేకూరుతుంది. అలాగే కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.