Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహాలయ అమావాస్య.. పితరులు వారసుల ఇళ్ల పరిసరాల చుట్టూ తిరుగుతారట..!

మహాలయ అమావాస్య.. పితరులు వారసుల ఇళ్ల పరిసరాల చుట్టూ తిరుగుతారట..!
, బుధవారం, 16 సెప్టెంబరు 2020 (14:05 IST)
భీష్ముడు అంపశయ్యపై ఉన్న సమయంలో ధర్మరాజుకు ఎన్నో హితబోధలు చేశాడు. వాటిలో పితరుల ఆరాధన ద్వారానే దేవతలు కూడా సంతృప్తి చెందుతారన్నాడు. దేవతలు కూడా పితృదేవతలనే ఎంతో భక్తితో పూజిస్తారని చెప్పి పితృ ఆరాధన ప్రాముఖ్యాన్ని తెలిపాడు. పితృదేవతారాధన తప్పనిసరిగా చేయవలసిన సందర్భాల్లో భాద్రపదంలో వచ్చే మహాలయ పక్షాలు కూడా ఒకటి. 
 
మహాలయంలో చేసే శ్రాద్ధకర్మలకు మరీ ముఖ్యమైనవని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మహాలయం (కృష్ణపక్షంలోని పాడ్యమి నుంచి అమావాస్య వరకూ ఉన్న పదిహేను రోజులు) కాలంలో పితరులంతా వారి వారి వారసుల ఇళ్ల పరిసరాల చుట్టూ తిరుగుతుంటారని పురాణాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే ఈ కాలం వారికి చాలా గడ్డుకాలం. విపరీతమైన ఆకలి, దాహంతో అలమటిస్తూ వారసులు అందించే పిండోదకాల కోసం వారివారి ఇళ్ల చుట్టూ సూక్ష్మరూపులై తిరుగుతుంటారు.
 
సూర్యుడు కన్య, తుల రాశుల నుండి వృశ్చిక రాశిలోకి వచ్చే వరకూ ప్రేతపురి ఖాళీగా ఉంటుందంట. పితరులంతా అన్నపానీయాల కోసం వారి వారసుల ఇళ్ల చుట్టూ తిరగడమే దీనికి కారణం. ఈ మాసంలో ఈ పదిహేను రోజులు వీరిని అన్నోదకాలతో సంతృప్తి పరచాలి. ఈ కాలంలో సూర్యుడు కన్యా రాశిలో ఉంటాడు. పార్వణ (అన్నప్రక్రియ) విధితో పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వహించి సంతృప్తి పరిస్తే ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారు.
 
సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు ఒక్కరోజైనా పితరులకు పిండప్రదానం చేస్తే వారెంతో ఆనందిస్తారు. మామూలుగా మన పెద్దలు పోయిన తిథినాడే మహాలయం పెడితే ఎంతో మంచిది అలా వీలుకాని పక్షంలో మహాలయ అమావాస్య నాడు పిండ ప్రదానం, తర్పణాలు, శ్రాద్ధం నిర్వహించినా మంచిదే. దీన్నే ఏ కారణంగానైనా మంచిది కాకపోయినా ఆ రోజే తప్పకుండా మహాలయాన్ని పెట్టవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 
ఈ పదిహేను రోజుల్లో అష్టమి, ద్వాదశి, అమావాస్య తిథుల్లోనూ, భరణి నక్షత్రం ఉన్ననాడు తిథి నక్షత్రాలతో నిమిత్తం లేకుండా శ్రాద్ధాదులను నిర్వహించవచ్చని హేమాద్రి ఖండమనే గ్రంథం తెలియజేస్తోంది. భార్య మరణించిన వారు అవిధవ నవమి నాడు అంటే మహాలయం ఆరంభమైన తొమ్మిదవ నాడు మహాలయం పెట్టాలి.
 
ఆ రోజు ఒక సుమంగళిని పిలిచి సౌభాగ్య చిహ్నాలైన పసుపుకుంకుమలు, మట్టెలు, నల్లపూసలు, గాజులతో పాటు చీర, జాకెట్టు ముక్క ఇచ్చి గౌరవించి పంపించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాలయ అమావాస్య.. బియ్యం, కూరగాయలు దానం చేస్తే?