Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు సంవత్సరాలు 60... తెలుసుకోవాల్సినదంతా ఇక్కడే ఉంది...

తెలుగు సంవ‌త్స‌రాల వెనుక ఓ కథ ఉంది. నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు

తెలుగు సంవత్సరాలు 60... తెలుసుకోవాల్సినదంతా ఇక్కడే ఉంది...
, గురువారం, 7 ఏప్రియల్ 2016 (20:33 IST)
తెలుగు సంవ‌త్స‌రాల వెనుక ఓ కథ ఉంది. నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
 
తెలుగు సంవత్సరాలు, ఆయనములు, ఋతువులు, మాసములు, తిథులు...
 
మన తెలుగు సంవత్సరాల పేర్లు : 
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.
 
సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది.... ఆయనములు 2: అవి...
ఉత్తరాయణం :
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించువరకు గల కాలము 6 నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంత భాగం, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉంటుంది. 
 
దక్షిణాయణం :
కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6 నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగం
 
సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు అవుతుంది... అందుకే ఋతువులు ఆరు... 
వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర
 
సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది... అందుకే
మాసాలు 12 :
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)
 
పక్షములు 2 :
ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణపక్షం(కృష్ణ అంటే నలుపు అని అర్థం)ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు... శుక్ల పక్షం పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు...
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.
ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి.
అవి...పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, అమావాస్య
 
ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు...
ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రంతో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడా నమోదు చేయగలిగినంత. అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి.
 
ఇప్పుడు మనం పాటించే అర్థంపర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు. మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాదే. ఇప్పటి నుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది. పంచాగం మొదలవుతుంది. సృష్టి మొదలవుతుంది. అందుకే ఇది యుగ ఆది అయింది. అదే ఉగాది అయింది.

Share this Story:

Follow Webdunia telugu