ఆర్థిక పరమైన బలం లేనప్పుడు మనిషి మరింత బలహీనుడిగా మారిపోతాడు. అందుకే ఆర్థికపరమైన సామర్థ్యం కోసం ఎవరికివారు తమవంతు కష్టపడుతుంటారు. ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ప్రీతి కలిగేలా ఆరాధించాలి. శుక్రవారం అనేది అమ్మవారికి ప్రీతికరమైన రోజు అనే విషయం తెలిసిందే.
ఆ రోజున అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి .. గులాబీలతో అర్చించి, ఆ తల్లికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆర్ధిక పరమైన సమస్యలు తొలగిపోయి, సంపదలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్టుగా నడచుకోవలసి ఉంటుంది. పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం.. ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెప్పబడుతున్నాయి. అందువలన వాటి విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
అలాగే బాగా పొద్దుపోయేవరకూ నిద్రించేవారి ఇళ్లలోను .. సాయంత్రపు వేళలో నిద్రించే వారి ఇళ్లలోను లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా సోమరితనంతో కాలాన్ని వృథా చేసేవారి ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది. ఇక ఎప్పుడు చూసినా కలహాలతో వుండే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా కాలు పెట్టదట. ఎక్కడైతే పవిత్రత .. ప్రశాంతత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు ఉండాలంటే, ఆమె మనసుకు నచ్చినట్టుగా నడుచుకోవాలి. ఎప్పడూ కూడా సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి. ఎంతటి కష్ట నష్టాలు ఎదురైనా, సత్య వ్రతాన్ని వీడకూడదు. ఇక నిస్వార్థంగా వ్యవహరించాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి .. గురువులను పూజించాలి .. పెద్దలను గౌరవించాలి. నిస్సహాయులైన వారికీ, సాదు జంతువులకు ఆహారాన్ని అందించాలి.
దైవ కార్యాలు .. ధర్మ కార్యాలు చేస్తూ ఉండాలి. తాను నిమిత్తమాత్రుడననీ .. తనతో చేయించువాడు భగవంతుడనే స్పృహను కలిగి ఉండాలి. ధర్మంగా తాను సంపాదించిన మొత్తంలో కొంత దానం చేయడానికి ఉపయోగించాలి. ఇలా పవిత్రమైన జీవితాన్ని గడిపేవారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనేది మహర్షుల మాట.