క్షీరాబ్ధి ద్వాదశి రోజున తులసీ పూజ విశిష్ట ఫలితాలను ఇస్తుంది. పాండవులు రాజ్యం పోగొట్టుకుని ద్వైతవనంలో ఉన్న సమయంలో అక్కడకు వచ్చిన వ్యాసమహర్షికి సకల ఉపచారాలు చేశారు. వారికి వ్యాసమహర్షి రెండు వ్రతాల గురించి చెప్పారు. వాటిలో మొదటిది క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, రెండోది క్షీరాబ్ధి శయన వ్రతం.
కార్తీకమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు క్షీరాబ్ధి ద్వాదశీవ్రతం చేస్తారు. ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసికోట దగ్గర శుభ్రంచేసి ముగ్గు పెట్టి, అందంగా అలంకరించి తులసి మొక్కలోనే ఉసిరి మొక్కను లేదా కొమ్మను ఉంచాలి. అనంతరం లక్ష్మీసమేతుడైన శ్రీ మహావిష్ణువును భక్తితో సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం కన్నుల పండువగా దీపాలు వెలిగించి.. తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యం, దీపదాన ఫలం విని బ్రాహ్మణులకు శక్తికొలది తాంబూలం సమర్పించుకోవాలి.
తులసికోట దగ్గర దీపదానం చేయాలి. భక్తితో ఓ వత్తి వేస్తే బుద్ధిశాలి అవుతారు, నాలుగొత్తులు వేస్తే రాజవుతారు. పది వత్తులు విష్ణుసాయుజ్యం, వేయివత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. దానం చేసే దీపంలో ఆవునేయి వేయాలి. నువ్వులనూనె కూడా వాడవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.