చాణక్యుని నీతి ప్రకారం అడ్డదారిలో జీవితంలో సాధించడం ఎలా అనేదానిపై చాణక్యుడు తెలిపిన పది పాయింట్లు ఏంటో చూద్దాం.. జీవితంలో అందరూ గెలవాలంటే.. అడ్డదారిలో వెళ్తే తప్పులేదు కానీ.. ఎంచుకున్న మార్గం ద్వారా ఇతరులకు ఎలాంటి హాని కలుగకూడదన్నారు.
సాధారణంగా గెలుపే ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ గుర్తిండిపోతుంది. అయితే కొందరి సుగుణాలను ప్రపంచం మరిచిపోతుంది. అలాంటప్పుడు అడ్డదారిలో కొన్ని పద్దతులను అవలంబించి గెలుపును వశం చేసుకుంటే.. ప్రపంచం మీ వైపు తిరిగిచూస్తుందని చాణక్యనీతి చెప్తోంది.
అవేంటంటే..
1. మీరు చూసే, మాట్లాడే, వినే పద్ధతి, ధోరణి అందరిలా కాకుండా వ్యత్యాసంగా వుండాలి. అప్పుడే గెలుపు సాధ్యం. ఒక విషయాన్ని గ్రహించడంలో, దాని గురించి మాట్లాడటంతో, ఆ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆలోచించే ధోరణి వ్యత్యాసంగా వుండాలి.
2. ఇతరుల సంతోషం కోసం ఎగబడటం కూడదు. శత్రువులు సులభంగా ఓడించే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా వుండకూడదు. ఇతరుల సంతోషం కోసం బతికే వారిని ఈ లోకం పక్కనబెట్టేస్తుందనే విషయాన్ని గుర్తించాలి.
3. ధనానికి వున్న ప్రాధాన్యతను గుర్తించాలి. ధనం లేకపోయినా వున్నట్లు ఓ మాయను సృష్టించాలి. అలా చేస్తే.. ఈ ప్రపంచం ఆస్తి, ధనం వున్నవారిని గుర్తించేలా మీకూ గౌరవం లభిస్తుంది. ధనం లేకపోయినా ఆ విషయాన్ని దాచిపెట్టాలి.
4. గెలుపుకు ముఖ్యంగా సమానమైన దూరం పాటించాలి. ఉదాహరణకు నిప్పుకు చాలా దగ్గరకు వెళ్లినా అది దహిస్తుంది. అలాగే నిప్పుకు చాలా దూరంగా వున్నట్లైతే ఆహారాన్ని వండలేం. కానీ సమానమైన దూరంలో వుంటే రుచికరమైన వంట సిద్ధమవుతుంది. అందుకే గెలుపుకు మూలాధారానికి సమానమైన దూరంలో వుండాలి.
5. ఆవేదన, ఆందోళన కూడదు. గత కాలాన్ని తలచి బాధపడటం కూడదు. తాను కోల్పోయిన ఆస్తి తలచి ఆవేదన చెందకూడదు. గతాన్ని గుర్తుచేసుకుని బాధపడటం బలహీనులు చేసేపని అని చాణక్య నీతి చెప్తోంది. గతంలో జరిగిన వ్యవహారాలతో అనుభవం పొందాలే తప్ప.. బాధపడకూడదు.
6. స్నేహం. ఎవరైనా ఒకరు ధర్మానికి విరుద్ధంగా ధనార్జన చేసినట్లైతే అలాంటి వ్యక్తులతో స్నేహం కూడదు.
7. ఏ కార్యాన్ని మొదలెట్టినా మూడు ప్రశ్నలతో ప్రశ్నించుకోవాలి. 1. నేనేం చేయాలి. 2. నేను చేసే కార్యానికి ప్రతిఫలం ఏమిటి? 3. నేను చేసే కార్యానికి విలువెంత? అనే ఈ మూడు ప్రశ్నలకు సమాధానమే మీరు చేసే పనికి ఆధారమవుతుంది.
8. ఎన్నాటికీ వెనుకంజ వేయకూడదు. ఆపదకు దూరంగా వుండాలి. ఒకవేళ ఆపద వస్తే దాన్ని చాతుర్యంగా ఎదుర్కొనే సత్తా గలిగివుండాలి. బలహీనతను, కష్టాన్ని ఎప్పటికీ ముఖంలో చూపెట్టకూడదు. ఆపదను తలచి వెనుకంజ వేయకూడదు.
9. ప్రశంసల కోసం పాకులాడకూడదు. చేసే పనిని ప్రశంసల కోసం చేయకూడదు. ఇతరుల కితాబుకోసం వేచిచూడకూడదు. నైపుణ్యంతో పనిపై శ్రద్ధ, దృష్టి పెడితే గెలుపు తనంతట అదే మిమ్మల్ని వరిస్తుందని చాణక్య నీతి చెప్తోంది.
10. బలహీనులను చులకనగా చూడకూడదు. వారిని అంత సులభంగా తీసిపారేయకూడదు. శత్రువులు బలహీనులైతే.. అది మీకు చాలా ప్రమాదం. వారు మీతో పోటీపడలేరు. కాబట్టి మీకు తెలియకుండానే మిమ్మల్ని పడగొట్టే సత్తా వారికి వుంటుందని గమనించాలి. స్నేహితులే కాకుండా శత్రువులకు సన్నిహితంగా వుండాలని చాణక్యుడు పేర్కొన్నారు.