అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది. ఇది జ్యోతిర్లింగమని.. తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు.
ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం.
అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అలాంటి అరుణాచల క్షేత్ర మహిమాన్వితమైనదే. అయితే ''అరుణాచల'' అనే నామము కూడా విశిష్టమైనది. అరుణాచల అనే మంత్రం నమఃశ్శివాయ అనే మంత్రం కంటే 3 కోట్ల రెట్లు ఎక్కువైంది.
ఎలాగంటే.. ఒకసారి భగవాన్ ఇలా అన్నారు. ''అరుణాచల'' అనేది మహా మంత్రం. ఇది ''నమఃశ్శివాయ'' అనే మంత్రం కంటే మూడు కోట్ల రెట్లు ఎక్కువైంది. అని. 3 కోట్ల సార్లు "నమఃశ్శివాయ" అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి ''అరుణాచల'' అని స్మరిస్తే అంత పుణ్యం వస్తుంది అన్నమాట.
ఇదెలా సాధ్యమంటే? అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి. నమశ్శివాయ అనేది యోగ పంచాక్షరి. ఇది నేను చెపుతున్నది కాదు. స్కాంద పురాణంలో కూడా రాయబడి వుందంని భగవాన్ స్కాంద పురాణం తీసి చదివి వినిపించారని పురాణాలు చెప్తున్నాయి.