బీజింగ్ ఒలింపిక్‌లో పతకాల పట్టికలోని అగ్రస్థానంపై దృష్టి పెట్టిన చైనాపై ప్రస్తుతం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కన్ను పడింది. పతకాల సాధన లక్ష్యంతో చైనా నిబంధనలను తుంగలో తొక్కిందన్న ఆరోపణల మధ్య ఐఓసీ చైనాపై విచారణకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా జిమ్నస్టిక్స్లో చైనా తరపున పతకాలు సాధించిన వారిలో వయసు తక్కువ వారెవరైనా ఉన్నార అన్న విషయాన్ని ఆరా తీయాల్సిందిగా జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్‌ను ఐఓసీ కోరింది. చైనాకు చెందిన హే కెక్సిన్ అనే చిన్నారి బీజింగ్ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ పోటీల్లో ఓ గ్రూపు స్వర్ణాన్ని, వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
అయితే రెండు స్వర్ణాలు సాధించిన ఈ చిన్నారి వయసు ఒలింపిక్ నిబంధనల ప్రకారం లేదనే విమర్శలు వినవచ్చాయి. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం జిమ్నస్టిక్స్లో పాల్గొనే వారి వయసు 16ఏళ్లు పూర్తయ్యి ఉండాలి. దీని ప్రకారం చైనా సమర్పించిన పత్రాల్లో హే కెక్సిన్ పుట్టిన తేదీని జనవరి 1 1992గా పేర్కొంది.
అయితే హే కెక్సిన్ వయసు ఇంకా 16ఏళ్లు పూర్తి కాలేదని పతకాల కోసం చైనా చిన్నారులను పోటీలకు పంపింది అనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ విషయం గురించి విచారించాల్సిందిగా అంతర్జాతీయ జిమ్నస్టిక్ ఫెడరేషన్‌ను ఐఓసీ కోరింది.