చైనా తొలిసారి ఆతిథ్యమిస్తున్న బీజింగ్ విశ్వ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని దూరదర్శన్ (డీడీ) చేస్తుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 17.30 ని. ల నుంచి రాత్రి 21.05 ని.ల వరకూ జరుగుతుంది. ప్రారంభోత్సవ వేడుకలు దూరదర్శన్ నేషనల్ ఛానెల్ (డీడీ-1) తో పాటుగా డీడీ స్పోర్ట్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
బీజింగ్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల ప్రత్యక్ష ప్రసారం ఆగస్టు 24వ తేదీన ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 17.30 ని.ల నుంచి రాత్రి 19.30 ని.ల వరకూ జరుగుతుంది. దేశంలోని క్రీడాభిమానుల కోసం దూరదర్శన్ ఈ యత్నాలు చేపట్టింది.
బీజింగ్ ఒలింపిక్స్‌లో కొన్ని పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటుగా మరికొన్నింటిని తర్వాత ప్రసారం చేయటానికి డీడీ చర్యలు తీసుకుంది. ఈ ప్రసారాలు నిరంతరాయంగా జరుగుతాయి. బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనటానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది క్రీడాకారులు అక్కడకు వచ్చారు.