బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో భారత జట్టు తరపున వెయిట్‌లిఫ్టింగ్‌లో బరిలోకి దిగాల్సిన మోనికా దేవి డోప్ టెస్టులో పట్టుబడింది. దీనితో భారత ఒలింపిక్ బృందానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విశ్వ క్రీడల్లో భాగంగా న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన డోప్ టెస్టుల్లో మోనికా దేవి దొరికిపోయింది. మోనికా నిష్క్రమణతో పూజారి శైలజ చివరి నిమిషంలో బీజింగ్‌కు బయలుదేరనుంది.
మోనికా దేవికి గతంలో జూన్ 29వ తేదీన డోప్ పరీక్షను నిర్వహించగా అందులో గట్టెక్కింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణి మోనికా దేవి. భారత వెయిట్‌లిఫ్టింగ్ జట్టులో 69 కిలోల విభాగంలో మోనికా దేవి తలపడాల్సి ఉంది.
జపాన్ వేదికగా ఈ ఏడాది జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో మోనికా ఒక రజతం, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. దీనితో బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆమెకు బెర్తు ఖాయమైంది. ఇండియన్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన శైలజా పూజారిని అధిగమించి మోనికా దేవి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.