Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిందీ పాటల్లో ఆణిముత్యం: యే జిందగీ ఉసీకి హై

హిందీ పాటల్లో ఆణిముత్యం: యే జిందగీ ఉసీకి హై

Raju

, గురువారం, 27 నవంబరు 2008 (06:55 IST)
కొన్ని పాటలు కొందరు పాడితేనే రస స్ఫోరకంగా ఉంటాయి. ఆ పాటకోసమే ఆ గాయనీ గాయకులు పుట్టారా లేదా వారికోసమే ఆ పాట పుట్టిందా అనేంతగా పాటా గాయకులు మమేకం అయిపోయిన సందర్భాలు సినీ సంగీతంలో కో కొల్లలు. హిందీ చలన చిత్ర సంగీత స్వర్ణయుగంలో వచ్చిన అలాంటి అపరూపమైన పాటల్లో యే జిందగీ ఉసీకి హై పాట ఒకటి.
యే జిందగీ ఉసీకి హై
  ప్రియుడు తప్ప ఈ ప్రపంచంలో మరేదీ తనకు అవసరం లేదని ఒక ప్రియురాలు ఏకాంతంలో రాసిచ్చిన అపురూప దఖలు పత్రం ఈ పాట. జీవితం ఇలా సాగాలని, ఇలా బతకాలని మధురోహలు పెట్టుకుని, కలలు కని, అవి భగ్నమైన వారి జీవితాలను ఈ పాట ఎంత శోకమయంగా పలకరిస్తుందో...      


ఈ పాట నాటి సంగీత దర్శకుడు సి రామచంద్ర స్వరకల్పనలో ఏ మంగళప్రద ఘడియలో లతా మంగేష్కర్ గాంధర్వ గాత్రంనుంచి వెలువడిందో కానీ గత ఆరు దశాబ్దాలుగా హిందీ పాటల శ్రోతల హృదయాలను అది మలయ సమీరంగా వెంటాడుతూనే ఉంది. జీవితమే సఫలమూ రాగసుధా భరితమూ అనే తెలుగు అనార్కలి సినిమాలోని పాటకు ఇది హిందీ మాతృక. ఆ నాటి హిందీ సినిమా సంగీత దర్శకులలో ఉన్నత శిఖరాలమీద నిలిచి ఉన్న సి రామచంద్ర ఈ పాటను లత చేత పాడించాలని తలచిన క్షణం సినిమా సంగీతలోకంలో ఒక గాన రేరాణికి పట్టం కట్టింది.

గాయనీ గాయకుల్లోని శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో అఖండుడైన సి రామచంద్ర ఈ పాటకు లతను ఎన్నుకున్న నేపథ్యం విలక్షణమైంది. యాభయ్యవ దశకంలో హిందీ చలన చిత్రరంగంలో దేదీప్యమానంగా వెలిగిన మెలోడీ సంగీత సౌధానికి పునాది రాళ్లుగా నిలిచిన నలుగురు సంగీత దర్శకుల్లో సి రామచంద్ర అగ్రగణ్యుడు. మిగతా ముగ్గురు అనిల్ బిశ్వాస్, మదన్ మోహన్, రోషన్.

దేశ విదేశాలకు సంబంధించిన ఏ సంగీత రూపాన్నయినా సినిమా సంగీతంలోని ఒడుపుగా తర్జుమా చేసుకుని దానికి భారతీయ ముద్రను ఒద్దిగా అద్దే రూపశిల్పి రామచంద్ర. పాటకు మంచి బాణీ కట్టడమే కాదు... గాయనీ గాయకుల ప్రతిభా పాటవాలను అంచనా వేసి, వారి స్వరపేటికలోని మంచిచెడ్డలను ఇట్టే పట్టేయడంలో రామచంద్ర అఖండుడు. సినిమాలకు వచ్చిన తొలిరోజుల్లో ఆనాటి అమర గాయక నటి నూర్జహాన్ ప్రభావానికి అమితంగా గురైన లతను దారి మళ్లించి లతగానే నిలబెట్టిన ఘనుడు రామచంద్ర.

ఈ క్రమంలో లత గాన భవిష్యత్తుకు రామచంద్ర తన నిరాలా -1950-, సర్‌గమ్ -1950-, పర్‌చాయి -1952-, షిన్ షినాకి బూబ్లబూ - 1952- సినిమాలు లతా, రామచంద్ర జంటను పాపులర్ చేస్తే, 1953లో వచ్చిన అనార్కలి చిత్రం ఈ జంటను శిఖరాగ్రానికి చేర్చింది.

అలనాటి హిందీ చిత్రం అనార్కలిలో లతా గొంతులోంచి జాలువారిన రామచంద్ర పాటలు విన్న శ్రోతలు సీ రామచంద్ర మహాప్రభో అని ఆనంద భాష్పాలు విడిచేవారట. అయితే ఒక గాయని సినీ గాన భవిష్యత్తును ప్రభావితం చేసిన అనార్కలి సినిమాలో పాటలకు లతాను ఎన్నుకోవడంలోనే రామచంద్ర గొప్పతనం దాగి ఉందంటారు విమర్శకులు.

అది బొంబాయి సినిమా పరిశ్రమ గీతాదత్ గోము పాటలనే తలచుకుని గుటకలు వేస్తున్న కాలం. అనార్కలి సినిమాలో కూడా ఆమె చేతనే పాటలు పాడిద్దామని అంతా అనుకుంటే రామచంద్ర మాత్రం లతా అని అన్నాడట. ఎంత ఖచ్చితంగా అంటే ఇంకెవ్వరూ నోరెత్తలేనంతగా చెప్పాడు. ఇంకేముంది. దాని తర్వాత అంతా చరిత్రే మరి.

మిగతా కొరవ రెండో పుటలో చూడండి...

webdunia
అనార్కలి సినిమా వచ్చి యాభై అయిదు సంవత్సరాలయింది. ఈ రోజుకూ ఈ సినిమాలోని 'యే జిందగీ ఉసీకి హై' పాట మర్చిపోలేకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది పాట కాదు. ప్రియుడు తప్ప ఈ ప్రపంచంలో మరేదీ తనకు అవసరం లేదని ఒక ప్రియురాలు ఏకాంతంలో రాసిచ్చిన అపురూప దఖలు పత్రం ఆ పాట.

రామచంద్ర సంగీత రాజమహలు నుంచి ఎగిరి వచ్చిన అందమైన పావురం 'యే జిందగీ ఉసీకి హై'. ఈ పాట తర్వాత లతా మంగేష్కర్ మరెవరి ఛత్రఛాయనా జీవించలేదు. తనుగా బతికింది. రాజహంసలా వెలిగింది. లత రామచంద్ర, ఆశా నయ్యర్‌ల జంట హిందీ సంగీత ప్రపంచంలో మమేకంగా బతికిన కాలమది.

వీరిద్దరి మధ్య ప్రేమ జీవితం మధ్యలోనే విరిగిపోవడం, చివరకు చిత్ర సంగీతం సంబంధాలు కూడా దెబ్బతిని సి. రామచంద్ర క్రమంగా మరుగున పడిపోవడం... ఇదంతా తదుపరి విషాద చరిత్ర. కాని ఈ ఇద్దరు గాయనీ, స్వరకర్తలు అందించిన ఆ మహిమాన్విత ప్రేమ గీతం నాటికీ, ఈనాటికీ, ఏనాటికీ చెక్కుచెదరలేదు.

శాశ్వతంగా, అజరామరంగా అనే భావనలు భౌతిక శాస్త్ర విరుద్ధంగానే ఉండవచ్చు కాని 'యే జిందగీ ఉసీకి హై' పాటకు మరణంలేదు. జీవితమే మధురంగా రాగసుధా భరితంగా అది అలా రసజ్ఞుల హృదయాంతరాళాలను కమ్మగా స్పృశిస్తూ, స్పర్శిస్తూ సాగుతూనే ఉంది.

ఈ పాట హిందీ, తెలుగు బాణీలను వినని వారు బహుశా ఎవరూ ఉండరు. ఒకవేళ ఎవరయినా పొరపాటున మిస్ అయి ఉంటే మాత్రం వెంటనే మేలుకోండి. హిందీ, తెలుగు అనార్కలి సినిమాలను సేకరించి మీ విరామ సమయంలో అన్ని పనులూ పక్కన బెట్టి చూడండి.

అన్ని ప్రేమ కథలలాగే సి. రామచంద్ర, లతల ప్రేమకథ విషాదంగానే ముగిసింది కానీ వీరిద్దరు సంగీత ప్రపంచానికి అందించిన ఆ సుమధుర గానం తన ప్రయాణాన్ని ఇంకా ముగించలేదు.

జీవితం ఇలా సాగాలని, ఇలా బతకాలని మధురోహలు పెట్టుకుని, కలలు కని, అవి భగ్నమైన వారి జీవితాలను ఈ పాట ఎంత శోకమయంగా పలకరిస్తుందో... ప్రేమ వైఫల్యానికి, ప్రేమ రాహిత్యానికి తమ ప్రమేయం లేకున్నా అనివార్యంగా గురైనవారు, గురి కావలసి వచ్చిన వారు ఈ పాట రేపెట్టే శోకభారానికి ఎంతగా కదిలిపోతారో, కదిలిపోగలరో ఫీలవ్వాలంటే ఒక్కసారి ఈ పాటను వినండి.

Share this Story:

Follow Webdunia telugu