Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిందీ గాయకుడు మహేంద్ర కపూర్ మృతి

హిందీ గాయకుడు మహేంద్ర కపూర్ మృతి

Raju

, ఆదివారం, 28 సెప్టెంబరు 2008 (15:35 IST)
హిందీ సినిమా నేపధ్య గాన చరిత్రలో ఒక ధృవతార నేల రాలింది. హిందీ పాటల స్వర్ణయుగంలో ఉద్భవించి అనేక తరాలను తన గాన మాధుర్యంతో పరవశింపజేసిన ఒక సుమధుర గళం శనివారం సాయంత్రం శాశ్వతంగా సెలవు తీసుకుంది. ప్రముఖ హిందీ, మరాఠీ చిత్రాల నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ శనివారం సాయంత్రం 7.30 గంటలకు ఆకస్మికంగా గుండెపోటుకు గురై నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 74 ఏళ్లు.

గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధికి గురై చికిత్స పొందుతున్న మహేంద్ర కపూర్ కొద్దిరోజుల క్రితమే కోలుకున్నారని, శనివారం సాయంత్రం హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనుకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆయనకు లతామంగేష్కర్ అవార్డును ప్రకటించింది.

1934లో జనవరి 9న అమృత్‌సర్‌లో జన్మించిన ఆయన ముంబైకి వచ్చిన మహేంద్ర సుప్రసిద్ధ హిందీ గాయకుడు రఫీ స్పూర్తితో సంగీత ప్రపంచంలోకి ప్రవేశించారు. బి.ఆర్. చోప్రా నిర్మించిన థూల్ కా పూల్, గుమ్రాహ్, వక్త్, హమ్రాజ్, ధుండ్ వంటి సినిమాలు ఆయనకు గాయకుడిగా పేరు తెచ్చిపెట్టాయి.

ముఖ్యంగా ప్రముఖ హిందీ చలన చిత్ర నటుడు మనోజ్ కుమార్ చిత్రాలకు ఆయన గాత్రం చక్కగా అమరేది. మనోజ్ నటించిన ఉప్కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్ చిత్రాల్లో మేరే దేశ్ కీ ధర్తీ, హయ్ ప్రీత్ జహాన్ కీ రీత్ సదా వంటి పాటలకు జీవం పోసిన మహేంద్ర ఎనలేని కీర్తి పొందారు. మేరే దేశ్ కీ ధర్తీ పాటకు ఆయన జాతీయ ఉత్తమ గాయకుని అవార్డు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది.

గుమ్రాహ్ చిత్రంలోని ఛలో ఏక్‌బార్ పిర్‌సే పాట ద్వారా 1963లో తొలిసారిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్న మహేంద్ర తర్వాత పలుసార్లు ఈ అవార్డును చేజిక్కించుకున్నారు. హిందీతో పాటు మరాఠీ, పంజాబీ, గుజరాతీ చిత్రాల్లో పలు పాటలు పాడారు. 2002లో బి.ఆర్ చోప్రా నిర్మించిన టీవీ సీరియల్ మహాభారత్‌లో చివరిసారిగా పాడిన మహేంద్ర అనంతరం సినీ సంగీతానికి దూరంగా గడిపారు.

హిందీ చలనచిత్రాల స్వర్ణయుగంలోని ఉద్దండ గాయకులు మహమ్మద్ రపీ, తలత్ మొహమూద్, ముఖేష్, కిషోర్ కుమార్ వంటి దిగ్గజాల సరసన నిలిచి తన కంటూ ఒక ప్రత్యేక గాన శైలిని ఏర్పర్చుకున్న మహేంద్ర మరణంతో హిందీ సినీ సంగీత చరిత్రలో స్వర్ణయుగానికి తెరపడినట్లే.

మహేంద్ర కపూర్ కన్నుమూశారన్న వార్త వినగానే అలనాటి హిందీ చిత్రాల హీరో మనోజ్ కుమార్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఒక సన్నిహిత సోదరుడిని, స్నేహితుడిని తాను శాశ్వతంగా కోల్పోయాయని ఆయన విలపించారు.

Share this Story:

Follow Webdunia telugu