రాలిపోయిన బెంగాలీ స్టార్ సుచిత్రా సేన్... ముఖం చూపించి 30 ఏళ్లు...ఎందుకని?
, శుక్రవారం, 17 జనవరి 2014 (18:20 IST)
బెంగాలీ తార సుచిత్రా సేన్ ఆనాటితరం ప్రేక్షకులకు కలలరాణి. ఆమె హీరోయిన్‌గా నటిస్తూ సినిమా వచ్చిందంటే కాసుల పంట కురుసేది. ఐతే ఆమె గత 3 దశాబ్దాలుగా బయటి ప్రపంచానికి దూరంగా కాలం వెళ్లబుచ్చారు. ముఖ్యంగా ఆమె 1978లో నటించిన 'ప్రొనొయ్ పాషా' అనే చిత్రం అపజయం అయిన తర్వాత సుచిత్రా సేన్ బాహ్య ప్రపంచానికి దూరంగా జరిగారు. ఈ కాలంలో ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినా దానిని అందుకునేందుకు తిరస్కరించారు. ఏదో ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ కు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తన రూపాన్ని బయటి ప్రపంచానికి చూపించేందుకు ఆమె ఇష్టపడలేదు. అలా బయటి ప్రపంచానికి రాకపోవడం వెనుక కారణం ఏమిటన్నది మిస్టరీగా మారింది. మరణించిన తర్వాత కూడా ఆమె భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ఆమె మృతదేహాన్ని నల్లటి అద్దాల మధ్య ఉంచి, పైన అంతా పూలతో కప్పివేయబడింది. ఐతే అభిమానులు పెద్ద పెట్టున సుచిత్రను చివరిసారిగా చూడాలని కోరినప్పుడు, తన మరణం తర్వాత తన ముఖాన్ని ఎవరికీ చూపించవద్దని ఆమె తమ వద్ద వాగ్దానం తీసుకున్నారనీ, అందువల్ల తాము చూపించలేమని చెప్పారు కుటుంబసభ్యులు. మొత్తానికి ఎందరో గుండెల్లో కలల రాణిగా నిద్రపోయిన సుచిత్రాసేన్, ఆనాటి చెదరని సౌందర్యరాశిగానే గుర్తిండిపోయారు. అలానే ఈ లోకం నుంచి దూరంగా వెళ్లిపోయారు.