Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనసున మల్లెల మాలలూగెనే...

మనసున మల్లెల మాలలూగెనే...

Raju

WD
మాట్లాడే భాషకు హృదయవీణలద్ది తేట తెలుగు స్వచ్చందనాలతో తెలుగు సినిమా పాటలను మూడు దశాబ్దాల పాటు హిమవన్నగంపై నిలిపిన అరుదైన కవులలో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒకరు. కోటి కోయిలలు ఒక్క గొంతుకతో తెలుగు పాట పాడితే ఎలా ఉంటుందో దేవులపల్లి పాటను విని మనం అనుభూతి చెందవచ్చు.

మావి చిగురు తినగానే కోయిల పలికేనా... ఆకులో ఆకునై పూవులో పూవునై.... నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది... గోరింట పూచింది కొమ్మా లేకుండా... ఆరనీకుమా ఈ దీపం... వంటి హృదయంగమ గీతాలను అందించిన కృష్ణశాస్తి తొలి సినిమా గీతం పాత 'మల్లీశ్వరి' చిత్రంతో మొదలు కావడం విశేషం.
  ఒక దీర్ఘ నిరీక్షణ అనంతరం. ఇక కలుసుకోవడం అసంభవం అనిపించిన బావ తన కళ్ల ముందే కదులాడితే... ఆ వెన్నెలరాత్రి.. ఉద్యానవనం నీటి మడుగు దాపున తనను కలవబోయే మహత్తర క్షణాల్లో ఒక పల్లె పడచు హృదయం కొట్టుకునే గుండె చప్పుళ్లే కృష్ణశాస్త్రి మనసున మల్లెల మాలలు...      


తెలుగు పాట ఇంత కమ్మగా, తీయగా ఉండేదా అని భవిష్యత్ తరాల తెలుగు వారు పొగుడుకునేటటువంటి అజరామరమైన సినిమా గీతాలు కృష్ణశాస్త్రి కలం నుంచి జాలువారాయి మల్లీశ్వరి నుంచి ప్రారంభించి ఆయన అందించిన సినిమా పాటలు సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు.

కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ కృష్ణశాస్త్రి రచన కృష్ణ పక్షము ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగాన్ని దీప్తింపజేసిన ఒక ముఖ్య క్షణం. ఇదే దాదాపు 50 ఏళ్ల తర్వాత మేఘ సందేశంలో సినిమా పాటగా మారి తెలుగు వారు గర్వంగా చెప్పుకునే గొప్ప గీతంలా చరిత్రలో నిలిచిపోయింది.

మల్లీశ్వరి సినిమాలో ఆయన తొలి గీతం చూద్దాం... పల్లెటూరులోని బావను వీడి అనుకోకుండా రాయలవారి అంతఃపురంలో నివసించవలసి వచ్చిన మల్లి.. తన బావను అదే అంతఃపురంలో కలుసుకునే క్షణం కోసం ఎదురు చూడవలసి వచ్చినప్పుడు... ఒక దీర్ఘ నిరీక్షణ అనంతరం. ఇక కలుసుకోవడం అసంభవం.. ముఖాముఖంగా చూసుకునే అవకాశం అసంభవం అనిపించిన బావ తన కనుల ముందు స్పష్టాస్పష్టంగా కదులాడితే... ఆ వెన్నెలరాత్రి.. ఉద్యానవనంలోని నీటి మడుగు దాపున కలవబోయే మహత్తర క్షణాల్లో ఒక పల్లె పడచు భావోద్వేగ హృదయం కొట్టుకునే గుండె చప్పుళ్లను కృష్ణశాస్త్రి గారు మనసున మల్లెల మాలలూగిస్తూ మనకు వినిపిస్తారు...

సున్నిత భావ ప్రకటనకు, ఒక ప్రియురాలి విరహ వేదనకు ఈ పాట ఒక సజీవ సాక్ష్యం... గువ్వల సవ్వడి వినిపించినా, గాలి కదులాడినా, కొలనులో అలలు గలగలమన్నా, కొంచెం దూరంలో వేణు గానం గాల్లో తేలుతూ హృదయాన్ని తాకినా నా బావే వచ్చాడంటూ ప్రకపించే ఒక తెలుగు ముగ్గ సుకుమార సౌందర్యాన్ని ఆ పాట, ఆ పాట చిత్రీకరణ నభూతో నభవిష్యతి అనేంత మహత్తరంగా మన కళ్లకు కట్టిస్తాయి. ఆ రాత్రి ఆ ప్రియురాలి మృత్యుశీతల అనుభవాన్ని ఆస్వాదించడానికైనా ఆ పాటను వినాలి. చూడాలి.

మీలో ఎవరైనా పాత తెలుగు మల్లీశ్వరిని చూసి ఉండకపోతే జీవితంలో ఒకసారైనా ఆ సినిమాను తెప్పించుకుని చూడండి. మన తర్వాతి తరాలవారికి తెలుగు సినిమా గొప్పతనం చూపించేందుకయినా ఆ సినిమా సిడి లేదా డివిడిని భద్రంగా పదిలపర్చుకోండి. మన భానుమతి పాడి, నటించినటువంటి జన్మానికో చల్లటి అనుభవం లాంటి ఆ పాటను తనివి తీరా వినండి.

మనసున మల్లెల మాలలూగెనె
కన్నుల వెన్నెల డోలలూగెనె
ఎంత హాయి ఈరేయి నిండెనో
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో

కొమ్మల గువ్వల సవ్వడి వినినా
రెమ్మల గాలుల సవ్వడి వినినా
ఆలలు కొలనులొ గలగల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా

నీవు వచ్చెవని నీపిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
గడియె యేని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా

ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో
ఎంత హాయి ఈరేయి నిండెనో

Share this Story:

Follow Webdunia telugu