Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నడిరేయి ఏ జాములో....

నడిరేయి ఏ జాములో....
, మంగళవారం, 8 ఏప్రియల్ 2008 (20:34 IST)
అమ్మగారిని నమ్ముకుంటే చాలు.. అనుకున్నవన్నీ నెరవేరుతాయని తెలుగు సామెత. అయ్యగారు అధికార స్థానంలో ఉండి ఒక పట్టాన కొరుకుడు పడని రకం మనిషి అయితే ఆయన సతీమణి... అదే.... అమ్మగారిని కాకాపడితే చాలు ఎంత కష్టమైన పని అయినా ఇట్టే జరిగిపోతుంది. పై సామెత అంతరార్థం ఇదే కదా....

తరతరాలుగా జన జీవితంలో ఒకానొక అనుభవం ఎంత అద్భుతమైన సామెతగా తయారైందంటే, ఈ అమ్మగారిని నమ్ముకుని పని పూర్తి చేసుకునే భావన ఈ నాటికీ తెలుగు సినిమాల్లో, సాహిత్యంలో పదేపదే ప్రస్తావించబడుతోంది. అమ్మగారికి మొరపెట్టుకోవడం ద్వారా సాక్షాత్తూ కోరిన వరాలిచ్చే శ్రీనివాసుడ్ని సైతం వశపర్చుకోవచ్చు అనే మేటి సందేశాన్ని దాదాపు 40 ఏళ్ల క్రితం ఓ తెలుగు సినిమా పాట చిరస్మరణీయ రీతిలో వెలువరించింది.

"నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చెనో.." దాదాపు తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరి నోటా ఈ పాట బహుశా నానుతూనే ఉంటుంది. 'భక్తునికి భగవంతునికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తీ' అని నేటి కాలంలో కాస్త వరుస మారి ఉండవచ్చు కాని దేవదేవుడిని సైతం వశపర్చుకోవాలంటే, ఆ దేవదేవికి మొరపెట్టుకోవడం కంటే మించిన సులభమైన మార్గం మరొకటి లేదని ఈ పాత సినిమా గీతం చెబుతోంది. ఈ పాట రంగులరాట్నం సినిమాలోది. సగటు మనిషి గుణాలను దేవుడికే ఆపాదించి అలరించిన ఈ గీతం తెలుగు సినీ గీత సాహిత్యంలో వెల్లివిరిసిన ఓ అనర్ఘరత్నం.

ఇలాంటి అద్భుతగీతాలు నాటి తెలుగు సినీ గీత సాహిత్యంలో వేనవేలుగా నిలిచి తరాల కతీతంగా శ్రోతల హృదయాలను రంజింపజేస్తున్నాయి. నాటి వెండి కెరటాలు శీర్షికను ప్రారంభించనున్న నేపథ్యంలో ఇలాంటి శిఖరాయమాన గీతాలను పరిచయం చేయడమే కాకుండా వెండితెరపై వెలుగు వెలిగిన అలనాటి తారాగణం జీవిత నటనా విశేషాలు, నాటి సాంకేతిక ప్రతిభ, మరుగున పడిన తెలుగు చిత్రసీమ చరిత్రను విశేషాంశాలుగా మీముందుకు తెచ్చేందుకు మాదైన ఈ చిన్ని ప్రయత్నాన్ని నేటినుంచీ మొదలెడుతున్నాం. ఈ శీర్షికపై మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలు, విమర్శలు మాతో పంచుకుంటారని ఆశిస్తూ...

తెలుగు.వెబ్‌దునియా.కామ్

Share this Story:

Follow Webdunia telugu