అశేష తెలుగు ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని దక్కించుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మించిన రోజు నేడు. ఆయన 1923 మే 28వ తేది, కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు.
చిన్నతనం నుంచే రంగస్థలంపై మక్కువ కనబరిచిన ఎన్టీఆర్ అవకాశం దొరికనప్పుడల్లా చిన్న చిన్న పాత్రలు వేస్తుండేవారు. అయితే తన 20వ ఏటనే వివాహం కావడంతో కుటుంబ పోషణ నిమిత్తమై ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆయన ఉద్యోగ వేటలో పడ్డారు. అయితే రంగస్థలంపై నాటకాలను వేయడంతోపాటు సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండేంది.
ఎల్వీప్రసాద్ తీయబోయే తదుపరి చిత్రంలో వేషం ఉందని తెలిసి రామారావు శ్రేయోభిలాషి సుబ్రహ్మణ్యం ఎన్టీఆర్‌ను ఎల్.వి.ప్రసాద్‌కు పరిచయం చేశాడు. ఆయన ఎన్టీఆర్‌ను స్క్రీన్ టెస్టులకు మద్రాసు రమ్మన్నాడు.
మద్రాసులో టెస్టులు చేసిన అనంతరం, తర్వాత కబురు చేస్తాం అని చెప్పి వెళ్లమన్నారు. దీంతో నిరాశకు లోనైన ఎన్.టి.ఆర్ ఉద్యోగం వేటలో పడ్డారు. ఇంతలో ఎల్.వి.ప్రసాద్ "మనదేశం"లో చిన్న వేషం ఇస్తానంటే రామారావు నిరాశపడ్డారు.
ఎన్టీఆర్‌కు రూ. 190 జీతంతో సబ్‌రిజిస్ట్రార్ ఉద్యోగం దొరికింది. దీంతో సినిమా ఆశలను తాత్కాలికంగా పక్కన పెట్టి గుంటూరుకెళ్లి ఉద్యోగంలో చేరిపోయారు. అదే సమయంలో దర్శకుడు బి.ఎ.సుబ్బారావు తాను తీస్తున్న "పల్లెటూరు పిల్ల" చిత్రంకోసం ఒక మంచి హీరోకై వెతుకుతున్నాడు.
ఎల్.వి.ప్రసాద్ ఆయనకు రామారావు పేరును సిఫార్సు చేశారు. దీంతో సుబ్బారావు రామారావుకి హీరో వేషం ఇస్తాననీ, మద్రాసు రమ్మని ఉత్తరం రాశాడు. లెటర్ అందుకున్న ఎన్టీఆర్ డోలాయమానంలో పడ్డాడు. ఉద్యోగమా, ఒడిదుడుకులతో కూడిన సినిమా అవకాశమా అని తీవ్రంగా యోచించారు.
చివరకు తన సోదరడు, ఇతర శ్రేయొభిలాషులూ సినీ అవకాశన్నే ప్రోత్సహించారు. దాంతో కేవలం 11రోజులు మాత్రమే చేసిన ఉద్యోగాన్ని వదులుకొని మద్రాసు రైలెక్కారు. ఇక వెనుదిరిగి చూడలేదు. నిరంతర కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించారు.
ఆంధ్రుల సినీ ఆరాధ్యులుగా కీర్తినొందిన ఎన్టీఆర్ 1982 మార్చి 29న మధ్యాహ్నం 2:30 గంటలకు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అఖండమైన మెజారిటీతో నాటి కాంగ్రెస్ పార్టీని ఓడించి 1983 తేదీ జనవరి 9న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు.