Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గున్నమామిడీ కొమ్మమీదా... గూళ్లు రెండుండేవీ...

గున్నమామిడీ కొమ్మమీదా... గూళ్లు రెండుండేవీ...

Raju

, బుధవారం, 16 జులై 2008 (15:15 IST)
తెలుగు పాటల్లో కరుణ రసానికి తిరుగులేని ప్రతీకలుగా మిగిలే అతి కొద్ది పాటల్లో గున్నమామిడీ కొమ్మ మీదా.. పాట ఒకటి. ఓ 20 లేదా 30 ఏళ్ల వెనక్కు పోయి చూస్తే ఆబాలగోపాలం ఈ పాటలోని గాన రసప్రవాహంలో ఓలలాడిందంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. ముఖ్యంగా పల్లెటూళ్లలో అటు వ్యవసాయ జీవితం, విద్యాజీవితంలో గడపిన పిల్లలు ఈ పాట వెనుక భావంతో తమ జీవితాలను పెనవేసుకున్న చిరస్మృతి ఇంకా మా తరానికి గుర్తు ఉంది.

ఆ నాటి పల్లెటూళ్లలో సామాజిక అంతరాలు, కుల, వర్గ భేదాలు ఎన్ని ఉన్నా ఈ పాట నేర్పిన సమానత్వ భావన, వర్గ, కులభేదాలకు అతీతమైన స్నేహం గురించి ఈ పాట నేర్పిన సమభావన ఆనాటి పిల్లల హృదయాలను ఊగించివేసింది. ఈ సినిమాను పల్లెటూరి టెంటులో చూసింది మొదలు గత 30 ఏళ్లుగా మా తరం జీవితంలోని ప్రతి దశలోనూ ఈ పాట చేదోడువాదోడుగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు మరి.
తెలుగు పాటకు నీరాజనం..
  ఇది తెలుగు పాటేనా అనిపించేంత కర్ణ కఠోరంగా, జుగుప్సాయుతంగా తెలుగు సినీ పాటలు తయారవుతున్న కాలానికి కనువిప్పు కలిగించే దివ్య గీతం ఈ పాట. ఇంత తేట తెలుగులో కూడా పాటలు రాయవచ్చా అని ఆశ్చర్యం కలిగించే గీతాల్లో ఈ పాట చిరస్థాయిగా నిలబడుతుంది...      


బాలమిత్రుల స్నేహాన్ని, కల్లలెరుగని, కల్మషాలు తెలియని చిరువయసులో ప్రేమానురాగాలను రామచిలుక, కోయిల సాన్నిహిత్యంతో పోల్చి స్నేహం గొప్పతనాన్ని ఉద్దీపింపజేసిన ఈ పాటను ఎన్ని వందల సార్లు మననం చేసుకున్నామో.. ఎన్నిసార్లు గొంతెత్తి మా పల్లె పొలాల్లో, కొండ గుట్టల్లో ప్రతిధ్వనించేలా ఎలుగెత్తి పాడామో.. లెక్క తెలీదు గానీ.. తెలుగు పాటకు మంత్రనాదాన్ని అందించి ప్రాణ ప్రతిష్ట చేసిన చిరస్మరణీయ గీతం గున్నమామిడి కొమ్మమీదా... గూళ్లు రెండుండేవి

పచ్చని చిలుకను నల్లటి కోయిలను కలిపింది మనసే అంటూ కులాంతర స్నేహసంబంధాలను ఆనాడే జాతి జనులకు చూపిన గీతమిది. అంతస్తుల తారతమ్యాలున్నా, సామాజిక నిచ్చెన మెట్లలో తేరి పార చూడలేనంత అంతరం ఉన్నా.. రెండు పసిహృదయాల్లో అంకురించిన దివ్య స్నేహాన్ని అద్భుతంగా ఆలపించిన గీతమిది.

రంగూ రూపూ వేరైనా, జాతీ రీతీ ఏదైనా, చిలుకా కోయిల చేసిన చెలిమి, ముందు తరాలకు తరగని కలిమి అంటూ ఆనాటి సామాజిక అసమానతలను హృద్యంగా చాటి చెబుతూనే ముందుతరాలు అంతరాలు లేని స్నేహాలను అనుభవించే కాలమొకటి వస్తుందనే చారిత్రక ఆశావాదంతో ముగిసిన గీతంమిది..

'బాలమిత్రుల కథ' అనే నాటి తెలుగు సినిమాకు మూలాధారంగా నిలిచిన ఈ గీతం ఇప్పటికీ రేడియోలోనో, టీవీలోనూ వినడం తటస్థిస్తే ఆ నాటి తరంవారికి కాలు కదపటం చేతకాదు మరి. ఆ పాటలోని మానవ సమధర్మం, సమానత్వం భావనలను వింటూ అవి ఆచరించడం ఈ నాటికీ సాధ్య కాకున్నా, ఆ మంత్రనాదాన్ని అలాగే హృదయానికి హత్తుకుంటూ అలాగే నిలబడిపోతుంది మా తరం...

అందుకే.. పాటలోని సాహిత్యం, సినిమా విశేషాల జోలికి ఇప్పుడు పోవటం లేదు గాని, ఈ పాట ఎక్కడయినా దొరికితే తప్పక మీరు వినడానికి ప్రయత్నించండి... సమానతా మంత్ర నగరి సరిహద్దుల దాకా మిమ్మల్నీ, మమ్మల్నీ, అందరినీ తీసుకుపోయే ఈ మహత్తర జాతి గీతామృతంలో ఓలలాడండి..

ఆపాత మధురాల్లో మేలి ముత్యం లాంటి ఈ పాట పూర్తి పాఠం తదుపరి పేజీలో చూడండి......

గున్నమామిడీ కొమ్మమీద
గున్నమామిడీ కొమ్మమీద
గూళ్లు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది "గు"

చిలకేమో పచ్చనిది
కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో
ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే
ముద్దు ముద్దుగ ముచ్చచలాడందే
చిగురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలుక ఊగదు కొమ్మ ఊయలా "గు"

ఒక మాటే పలుకుతాయ్
ఒక జట్టుగ తిరుగుతాయ్
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయ్
రంగూ రూపూ వేరైనా
జాతీ రీతీ ఏదైనా
చిలుకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి "గు"

Share this Story:

Follow Webdunia telugu