ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. పాత చిత్రాలను తిరిగి మళ్ళీ తీసేందుకు నిర్మాతలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. మొన్ననే రామానాయుడు 'రాముడు-భీముడు' వంటి చిత్రాన్ని మళ్లీ ఈనాటి జనరేషన్ ఎన్.టిఆర్.తో తీయనున్నట్లు ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వకపోవడంతో... రామానాయుడు మనవుడు రానా తాను చేస్తానని చెప్పాడు.
నీకు సూట్ కాదురా అని సున్నితంగా తిరస్కరించారు కూడా. అయితే... గురువారంతో 'గుండమ్మకథ' చిత్రం యాభై ఏళ్ళు అయిన సందర్భంగా ఆ చిత్రాన్ని తీయడానికి చాలా మంది ముందుకు వస్తున్నట్లు... ఫలానా పాత్రను ఫలానావారు చేస్తున్నట్లు వార్తలు విన్పించాయి.
ముఖ్యంగా సూర్యకాంతం పాత్రకు శ్రీదేవి సరిపోతుందని చర్చ సాగింది. పలువురు దర్శకులు కూడా ఆమె పేరు చెప్పారు కూడా. కానీ ఇటువంటి ప్రయోగాలు చేయడం చాలామంది దర్శకులకు ఇష్టంలేదు. ఇదే అభిప్రాయాన్ని ఫిలింఛాంబర్‌లో సభ్యులు వ్యక్తం చేశారు కూడా. చాలామంది ఛాంబర్ అధ్యక్షుడికి ఫోన్లు చేసి... ఇలాంటి మాన్యుమెంట్స్‌ను టచ్ చేస్తే అటోఇటో అవుతాయని వాటిని కళాఖండాలుగా దాచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఒకవేళ శ్రీదేవి ఆ పాత్ర వేసినా ఆమె నటించడానికి ఒప్పుకోవాలి కదా....అంటూ వారికి సర్దిచెప్పారు. గతంలో మాయాబజార్ చిత్రాన్ని కలర్‌లో తీస్తున్నపుడు కూడా ఇలాంటి చర్చే జరిగింది. ఆఖరికి సాహసం చేసి ఓ సంస్థ ముందుకు వచ్చి ఆ చిత్రాన్ని కలర్‌లో మార్చింది. మొదటి ప్రయత్నం గనుక ఆ చిత్రం బాగానే ఆడింది. మళ్ళీ ఆ సంస్థ రెండో ప్రయత్నంగా పాతచిత్రాలను కలర్‌లో మార్చడానికి ప్రయత్నించడానికి ముందుకు వచ్చినా... కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గింది.