Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"కళాప్రపూర్ణ"గా ఓ వెలుగువెలిగిన ఆకాశరామన్న

WD
టాలీవుడ్‌లో అలనాటి సినీ తారగా ఓ వెలుగు వెలిగిన కాంతారావుకు చాలా ధైర్యమని ఇండస్ట్రీ ప్రముఖులు అంటున్నారు. "గురువును మించిన శిష్యుడు" చిత్రంలో నోరు కుట్టేసిన సింహంతో పోరాడినప్పుడు ఆ కట్లు తెగిపోగా అదృష్టవశాత్తు మృత్యువు నుంచి కాంతారావు బయటపడ్డాడు. లేదంటే కాంతారావు కన్పించేవారు కాదని ఇండస్ట్రీ భావిస్తోంది. అలాగే "శ్రీ గౌరీ మహాత్మ్యం" లో నిజమైన సర్పాల్ని మెడలో ధరించారు. ఈ సందర్భంలో ఆ సినిమా యూనిట్ కాంతారావు ధైర్యాన్ని మెచ్చుకున్నారట.

నారదునిగా, కృష్ణునిగా మెప్పించిన కాంతారావు
పౌరాణిక చిత్రాన్ని గురించి ప్రస్తావించవలసి వచ్చినప్పుడు కాంతారావును "అపరనారదుని"గా కీర్తిస్తారు. దాదాపు 15 చిత్రాల్లో నారదపాత్ర పోషించారు. అంతేగాకుండా ఎన్టీఆర్ పోషించిన శ్రీకృష్ణ, శ్రీరామ, అర్జున, బృహన్నల పాత్రల్లోనూ కాంతారావు నటించి మెప్పించారు.

ఒక విధంగా చెప్పాలంటే అక్కినేని, ఎన్టీఆర్ ఒక టీమ్ అయితే, జగ్గయ్య, కాంతారావు రెండో టీమ్. వీరిద్దరూ, వారిద్దరి సరసన రాణించి సన్నివేశాల్ని రక్తికట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నటనాపరంగా నవగ్రహ పూజా మహిమ, గురువును మించిన శిష్యుడు, రక్తసంబంధం, తోటలోపిల్ల కోటలో రాణి, కంచుకోట, శాంతినివాసం, ఖైదీ కన్నయ్య, ఆకాశరామన్న వంటి చిత్రాలు కాంతారావు నటనాజీవితంలో చెప్పుకోదగినవి.

ఇకపోతే.. నిర్మాతగా మారి చక్కని అభిరుచితో సప్తస్వరాలు గండరగండడు, గుండెలు తీసిన మొనగాడు, స్వాతిచినుకులు వంటి చిత్రాలను తీశారు. తాను హీరో అయి వుండి, కృష్ణ కథానాయనికునిగా ప్రేమజీవులు అనే చిత్రాన్ని నిర్మించారు. అయితే నిర్మాతగా ఆయన చేదు అనుభవాన్నే చవిచూశారు.

మొత్తం 400 సినిమాల్లో నటించి, సహాయపాత్రలు పోషిస్తూ.. ఇటు వెండితెరైనా, అటు బుల్లితెరపైన అభిమానుల్ని పలకరించిన కాంతారావును ప్రజలు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. అంతేగాకుండా.. రఘుపతి వెంకయ్య అవార్డు, లవకుశ పాత్రకు జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు. ఇకపోతే.. ఆయన స్వీయచరిత్రను రాసిన పుస్తకం "అనగనగా ఓ రాకుమారుడు"కు నంది అవార్డు దక్కింది.

Share this Story:

Follow Webdunia telugu