గురు గోపీనాథ్ 20 శతాబ్దిలోని భారతీయ నృత్య చరిత్రలో నిరుపమాన వ్యక్తిత్వంతో వెలుగొందారు. భారతీయ సాంప్రదాయ నృత్యంలో ఆయన మేటి నాట్యాచార్యుడు. తన జీవిత ప్రారంభంలో గోపీనాథ్ చేసిన కృషి ఫలితంగానే కథాకళి నృత్యాం కేరళలోనూ విదేశాల్లోనూ ప్రఖ్యాతి గాంచింది.
నృత్యకారుడిగా గోపీనాథ్ సాధించిన అత్యున్నత విజయం ఏదంటే కథాకళిని నృత్యగురువులకు, విద్యార్థులకు, ప్రేక్షకులకు మరింతగా సుబోధకం చేయడమే. ఇందుకుగాను తన సృజనాత్మకతను మేళవించి, ప్రాచ్య నృత్యరూపంగా పేరొందిన ఈ పురాతన నృత్యంనుంచి నూతన నృత్య శైలిని రూపొందించారు. ఆయన కృషివల్లే ఈ నృత్యం కథాకళి నటనం అని తర్వాత కేరళ నటనం అని పేరు పొందింది.
1908 జూన్ 24న కేరళలోని అలెప్పీ జిల్లాలో అంబాలప్పుజ తాలూకా చంపక్కులమ్‌లో మాధవి అమ్మ మరియు కైఫ్పిల్లి శంకర పిళ్లై దంపతులకు జన్మించిన గోపీనాథ్ కథాకళిని, వ్యవసాయాన్ని సాంప్రదాయిక వృత్తిగా స్వీకరించిన పెరుమన్నూర్ కుటుంబానికి చెందినవారు.
13 ఏళ్ల ప్రాయంలోనే కథాకళిని నేర్చుకోవడం ప్రారంభించిన గోపీనాథ్ 12 ఏళ్లపాటు కఠోర దీక్షతో ముగ్గురు సుప్రసిద్ధ గురువుల వద్ద కథాకళిని నేర్చుకున్నారు. కథాకళి నాట్యంలో సుప్రసిద్ధులైన కళామండలం కృష్ణయ్యర్, కళామండలం మాధవన్, ఆనంద శివరామ్ వంటి ప్రముఖులతో కలిసి ఆయన శిక్షణ పొందారు.
కథాకళి నృత్యం లోని రెండు రీతుల్లోనూ గోపీనాథ్ నిష్ణాతుడిగా పేరొందారు. జన్మతః కళాకారుడిగా గుర్తింపుపొందిన గోపీనాథ్ కథాకళి సాంప్రదాయరీతిని ఔపోసన పడుతూనే ఈ సాంప్రదాయాన్ని నవ్యరీతులతో విస్తరించడంతో తన స్వంత ప్రతిభను అద్భుతరీతిలో ప్రదర్శించారు.
తన సృజనాత్మక ప్రతిభ వల్లే భారతీయ నాట్యరీతుల్లో పేరొందిన కథాకళి 1930లలోనే ప్రపంచ ఖ్యాతి పొందింది. ఆధునిక ప్రపంచానికి తగినట్లుగా సృజనాత్మక శైలిని రూపొందించిన గోపీనాథ్ కేరళ నటనం పేరిట కొత్త నృత్యరీతిని కూర్చారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గురు గోపీనాథ్ శైలిని కథాకళి అనే వ్యవహార పేరుతో పిలుచుకుంటున్నారు.