ప్రసిద్ధ నటుడు, ప్రఖ్యాత కథా,నాటక రచయిత, విఖ్యాత సినీ రచయిత, మేటి దర్శకుడు, పేరొందిన చిత్ర నిర్మాత, ప్రముఖ పాత్రికేయుడు, సుప్రసిద్ధ సంపాదకుడు, కళా,సాహిత్య రంగాల సవ్యసాచి వెరసి... బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయనే రావికొండలరావు. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా కొన్ని ఆయన గురించిన విషయాలు.
రావికొండలరావు తండ్రి పోస్టుమాస్టరు. పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరి తండ్రి పదవీ విరమణ తర్వాత అక్కడ స్థిరపడ్డారు.
ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీప్రస్థానంలో 600లకు పైగా సినిమాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన వీరు,1932, ఫిబ్రవరి 11 న తూ.గో జిల్లా సామర్ల కోట లో జన్మించారు.కాకినాడ, శ్రీకాకుళం,విజయనగరంలలో వీరి విద్యాభ్యాసం సాగింది.
13వ ఏట నుండే రచనలు చేసారు. అవి 'బాల'మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. 1948 జనవరి 'యువ'సంచికలో 'దైవేచ్ఛ' కథతో వీరి కథారచనఆరంభమైంది. మద్రాసు చేరాక 1966 నుండి'విజయచిత్ర' సినిమా పత్రికకు సంపాదకత్వం వహించారు.
కళాకారుడిగా ప్రస్థానం-
"మిస్ ప్రేమ" అనే నాటకం ద్వారా శ్రీకాకుళం నుంచి మొదలైంది. స్వయంవరం,కుక్కపిల్ల దొరికింది, కథకంచికి,పెళ్లిచేసిచూపిస్తాం,మాఇల్లు అద్దెకిస్తాం, చుట్టం కొంపముంచాడు,బస్ స్టాప్, అంతరాయానికి చింతిస్తున్నాం,రాయబారం, గృహకలాపం మొదలగునాటికలు రచించారు.
వీరు రచించిన 'నాలుగిళ్ల చావిడి,పట్టాలు తప్పిన బండి మొదలగు నాటకాలు ప్రజాదరణ పొందాయి. 'నాలుగిళ్లచావిడి' చలనచిత్రంగా కూడా నిర్మించారు. ఇంకా పలు రేడియో నాటకాలు, కథలు, వ్యాసాలుఐదారొందలు దాకా రచించారు.
సినీ దిగ్గజ రచయిత డి.వి నరసరాజు స్ఫూర్తితో రచనావ్యాసంగానికి మెరుగులు దిద్దుకొన్నారు. 1958లో 'శోభ' చిత్రంతో కొండలరావు సినీ జీవితం మొదలైంది.తమిళ, మలయాళ సినిమాలకు కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు. మద్రాసు ఆనందవాణి పత్రిక సబ్ ఎడిటర్‌గా పనిచేశారు.
వీరి సతీమణి రాధాకుమారితో కలసి దాదాపు 100 చిత్రాల్లో భార్యాభర్తలుగా కలిసి నటించారు. ఆవిడ 2012 లో మృతి చెందారు.
తెలుగు సినీ పరిశ్రమపై వ్రాసిన 'బ్లాక్అండ్‌వైట్' అనే పుస్తకానికి గాను 'నందిఅవార్డ్' ను అందుకొన్న
రావి కొండలరావు సినీ కథా రచయితగా కూడా నందిని సొంతం చేసుకొన్నారు. బాపు దర్శకత్వంలో వచ్చిన చిత్రరాజం 'పెళ్ళిపుస్తకం' సినిమాకు కథను అందించడమే కాక, అందులో గుమ్మడి సహాయకుడిగా సంభాషణలు లేని హావ,భావ అభినయాలతో రావి కొండలరావు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ఈయన సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల మొదలైన వివిధ పత్రికలలో రచనలు చేశారు. హాస్యరచయితగా గుర్తింపు పొందారు. 'సుకుమార్' అనే కలంపేరుతో కూడా కొన్ని రచనలు చేశారు.
వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం "కళాప్రపూర్ణ" ఇచ్చి గౌరవించింది.
'బ్లాక్ అండ్ వైట్ 'పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారం, 2004 సంవత్సరానికి అ.జో-వి.భొ. కందాళం ఫౌండేషన్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం పొందిన రావికొండలరావు 2020, జూలై 28వ తేదీన కన్నుమూశారు.