Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సముద్రాల వారి... అందమె ఆనందం... ఆనందమే జీవిత మకరందం...

Advertiesment
samudrala junior birth anniversary
, మంగళవారం, 6 అక్టోబరు 2015 (21:30 IST)
సముద్రాల జూనియర్‌‌గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ఈయన తండ్రి సముద్రాల రాఘవాచార్య కూడా ప్రఖ్యాత సినీ రచయిత. వీరిది పండిత వంశం. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామం. 1923 వ సంవత్సరం అక్టోబర్‌ 6న జన్మించారాయన. 
 
రాఘవాచార్యులుగారు 'ప్రజామిత్ర' పత్రికలో పనిచెయ్యడానికి మద్రాసుకి మకాం మార్చడంతో, రామానుజం కూడా మద్రాసు చేరి, జార్జ్‌టవున్‌లోని హైస్కూల్లో చదివాడు. ఉన్నత పాఠశాల చదువులో వుండగానే, ఆయన రాసిన పద్యాలు, గేయాలూ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 'సముద్రుడు' పేరుతో 'ప్రజాబంధు'లో రాసేవాడు. అభ్యాసం, అధ్యయనం రెండూ సవ్యసాచిలా నిర్వహిస్తూ రామానుజం బి.ఎస్‌సి.కి వచ్చాడు. ఆ వేళకి పెద్ద సముద్రాలవారు సినిమాలకి వచ్చేశాడు. ఐతే, తనలాగా తనయుడికీ సినిమా ఉత్సాహం రాకూడదనీ, పెద్ద ఇంజనీరు కావాలనీ ఆయన ఆశించారు. తండ్రి బాటలోనే సాగుతూ సినీరంగంలో స్థిరపడాలని రామానుజాచార్య చిన్ననాటనే నిర్ణయానికొచ్చారు.
 
రామానుజం దృష్టి సౌండ్‌ ఇంజనీరింగ్‌ మీదికి వెళ్లింది. రేడియో సర్వీసింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోర్సు చదివి 1946లో డిప్లొమా పుచ్చుకున్నారు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కూడా చదవాలనుకున్నారు గాని, ఆ ఊహ ఇంకోదారి చూపించింది. కొడుకు ఉత్సాహం చూసి, రాఘవాచార్యులుగారు అతన్ని వాహిని స్టూడియో శబ్దగ్రహణ శాఖలో చేర్పించారు. నేటి ప్రసిద్ధ దర్శకుడు, నటుడు- కె.విశ్వనాథ్‌ కూడా అప్పుడు ఆ శాఖలో వుండేవారు. ఇద్దరిలోనూ శక్తి సామర్థ్యాలుండటంతో చేరిన తొమ్మిది నెలల్లోనే 'రికార్డిస్టు'లు అయ్యారు. ఎ.కృష్ణయ్యర్‌ మాకు పెద్ద గురువు అని చెప్పేవాడు రామనుజాచార్య. 
 
స్టూడియోలో వుండటం వల్ల సినిమా చిత్రీకరణ, కథనాలూ అవగాహన అయ్యాయి అతనికి. సినిమా రచనలో తండ్రిగారికి సహాయపడటం కూడా అలవాటు చేసుకున్నాడు. కృష్ణయ్యర్‌, ఇంకో ఇంజనీరు శ్రీనివాస రాఘవన్‌ రామానుజంలో వున్న సాహిత్యానుభవం చూసి, ఇలా రికార్డింగ్‌లు చేసుకుంటూ వుండటం కంటే, రచన చేపట్టు- రాణిస్తావు అని ప్రోత్సహించారు. శబ్దగ్రహణ శాఖలో రాణించి, ఇంజనీర్‌ కావాలని రామానుజం కోరిక. నీకున్న ప్రజ్ఞే గనుక నాకుంటే, నేను శబ్దగ్రహణ శాఖ విడిచిపెట్టి రచయితని అయ్యేవాడిని అని కృష్ణయ్యర్‌, రెండుమూడేళ్ళు రచయితగా పని చెయ్యి. సక్సెస్‌ కాలేదనుకో మళ్ళీ మన శాఖకి రా. నేను ఉద్యోగం ఇస్తాను అని శ్రీనివాస రాఘవన్‌- రామానుజాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. 
 
తండ్రిగారికీ అంత ఇష్టం లేకపోయినా ఇతరుల ఆకాంక్షలకి తల ఒగ్గి, రామానుజం సినిమా రచన చెయ్యడానికి ఉద్యమించాడు. దాంతో ఆయన రచయితగానే ప్రవేశించాడు. వినోదావారు 'శాంతి' (1952) సినిమా మొదలు పెడుతూ రామానుజం చేత పాటలు రాయించారు. తర్వాత 'అమ్మలక్కలు' (1953)లోనూ, 'బ్రతుకుతెరువు' (1953)లోనూ పాటలు రాశాడు. ''బ్రతుకుతెరువు'' సినిమా జూనియర్‌ సముద్రాలకు బతుకు తెరువు చూపించి, పాటల రచయితగా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఆ సినిమాలోని ''అందమె ఆనందం..... ఆనందమె జీవిత మకరందం.....'' ఆయన కలం నుంచి జాలువారిందే.
 
యన్‌.టి.రామారావుకి- రామానుజం రికార్డిస్టుగా ఉన్నప్పట్నుంచీ తెలుసు. ఆయన సాహిత్యాభిలాష తెలుసు. పాటలు రాస్తున్న విషయమూ తెలుసు. అంచేత తను ప్రారంభిస్తున్న 'తోడు దొంగలు' (1954)కు రచన చెయ్యమని అడిగి ఆ సినిమాకి రాయించారు. అది రామానుజం మాటలు రాసిన తొలి సినిమా. దర్శకత్వ శాఖలో కూడా పనిచెయ్యాలని, ఆయన ఎన్‌.ఎ.టి.లో సెట్సు మీద కూడా పనిచేశాడు. రామానుజం రెండో సినిమా 'జయసింహ' (1955) జయ పతాకం ఎగరవేసినప్పట్నుంచి, రామానుజం 'సముద్రాల జూనియర్‌'గా మారి సంభాషణలు రాయడం మీదనే దృష్టి సారించాడు.
 
'పాండురంగ మహాత్మ్యం' (1957), 'మంచి మనసుకి మంచి రోజులు' (1958), 'శాంతి నివాసం' (1960), 'ఆత్మ బంధువు' (1962), 'ఉమ్మడి కుటుంబం' (1967) 'స్త్రీ జన్మ' (1967), 'తల్లా? పెళ్లామా?' (1970), 'శ్రీ రామాంజనేయ యుద్ధం' (1975) లాంటి 70 చిత్రాలకు పైగా రచన చేశాడు జూనియర్‌ సముద్రాల. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న సముద్రాల రామానుజాచార్య 1985 మే 31న కాలం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu