Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహా భారతం డ్రీమ్ ప్రాజెక్ట్.. పవన్ కల్యాణ్‌తో బోస్... దాసరి తీరని కోరికలు...

తాండ్ర పాపారాయుడు, విశ్వనాథ నాయకుడు వంటి చారిత్రక సినిమాలను తీసి అఖండ విజయం సాధించిన తెలుగు చిత్రసీమ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రతిభ దూరదర్శన్ కోసం సుదీర్ఘ సీరియల్ విశ్వామిత్ర తీసి దేశవ్యాప్తంగా కీర్తి సాధించారు. సాంఘికం, చారిత్రకం ఇతివృత్తాల

మహా భారతం డ్రీమ్ ప్రాజెక్ట్.. పవన్ కల్యాణ్‌తో బోస్... దాసరి తీరని కోరికలు...
హైదరాబాద్ , బుధవారం, 31 మే 2017 (05:01 IST)
తాండ్ర పాపారాయుడు, విశ్వనాథ నాయకుడు వంటి చారిత్రక సినిమాలను తీసి అఖండ విజయం సాధించిన తెలుగు చిత్రసీమ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రతిభ దూరదర్శన్ కోసం సుదీర్ఘ సీరియల్ విశ్వామిత్ర తీసి దేశవ్యాప్తంగా కీర్తి సాధించారు. సాంఘికం, చారిత్రకం ఇతివృత్తాలతో నిరుపమాన చిత్రాలు తీసిన దర్శకరత్న దాసరి జీవితంలో కన్న గొప్ప కల మహాభారతం. భారత, రామాయణాలకు సినిమా రూపం ఇవ్వడంలో తెలుగువాళ్ళను మించిన వారు లేరని దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అప్పటికే నాలుగైదు దశాబ్దాలుగా తెలుగులో డజన్లకొద్దీ సినిమాలు భారత రామాయణ నేపథ్యంలో తీసి వున్నా దాసరి సైతం మహాభారతానికి సినిమా రూపం ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆ కల నిజం కాకుండానే వెళ్లిపోయారు. 
 
కొంత కాలం క్రితం ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాసరి స్వయంగా తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి వివరించారు. ‘‘మహాభారతం నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. అందులో భారత యుద్ధాన్ని తెరపై చూపించాలన్నది నా కల. మహాభారతాన్ని చాలామంది తీశారు కానీ, యుద్ధం జరిగిన రోజుల్లో రాత్రిపూట జరిగిన రాజకీయాలను ఎవరూ చూపించలేదు. 18 రోజులు జరిగిన యుద్ధంలో గొప్ప మంత్రాంగాలు జరిగాయి. గొప్ప గొప్ప కథలున్నాయి. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నాలుగు భాగాలుగా ఆ సినిమా తీయాలనుకుంటున్నా. 
 
ఒక్కో భాగానికయ్యే బడ్జెట్‌ వంద కోట్లు. ఈ చిత్రాన్ని ఓ విదేశీ కంపెనీతో కలిసి నిర్మించబోతున్నాం. కొంతమంది రచయితలతో కలిసి స్క్రిప్ట్‌ తయారు చేయిస్తున్నా. రెండు భాగాలకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి. మొత్తం నాలుగు భాగాలు పూర్తి కావడానికి ఏడాది పడుతుంది. ఈ నాలుగు భాగాలకూ నేనే దర్శకత్వం వహిస్తా.  నాతో పాటు నలుగురు దర్శకులు కూడా ఈ ప్రాజెక్ట్‌కి వర్క్‌ చేస్తారు. భారతీయ భాషలన్నింటిలోనూ ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నాను కాబట్టి, అన్ని భాషలవాళ్లనీ తీసుకోవాలనుకుంటున్నా. దర్శకునిగా నా చివరి చిత్రం ఇదే అవుతుంది. ఘంటశాలగారికి ’భగవద్గీత’ ఎలా మిగిలిపోయిందో, నా జీవితానికి ఈ భారత యుద్ధం మిగిలిపోవాలన్నది నా లక్ష్యం’’. 
 
విషాదం ఏమిటంటే నాలుగు భాగాలుగా తీయాలనుకున్న మహాభారతం ప్రాజెక్టు నెరవేర్చుకోలేకపోయారు. ఇటీవల పవన్ కల్యాణ్‌తో బోస్ సినిమా తీస్తానని చెప్పి పవన్‌ని ఒప్పించారు కూడా. కానీ ఆ ప్రయత్నం కొలిక్కి రాకముందే దాసరి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కష్టాల కొలిమిలో కాలి కాలి... కళామతల్లి ఒడిలో తరించిన దాసరి