Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాహస జానపద హీరో సినీ ప్రస్థానం

సాహస జానపద హీరో సినీ ప్రస్థానం
WD
సాహస జానపద హీరోగా తెలుగు ప్రేక్షకుల మదిలో కదలాడే కళాబ్రహ్మ కత్తుల కాంతారావు (86) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం బీపీ తగ్గడంతో కిందపడిపోయిన కాంతారావును, హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ కాంతారావు తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు చెప్పారు. కాంతారావు మరణ వార్త వినగానే యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. కాంతారావు మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ప్రరాపా అధినేత మెగాస్టార్ చిరంజీవి తదితరులు సంతాపం ప్రకటించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

కాంతారావు తన వైవిధ్యమైన నటనతో అశేష తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన నటించిన చిత్రాలు నేటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతుంటాయి.

అశ్వరూఢుడైన కథానాయకుడు వాయువేగంతో వెళుతూ దుష్టసేనాని బారి నుంచి రాకుమారిని రక్షించి, ఆమె ప్రేమను పొందడం, అదే రాజకుమారిని మాంత్రీకుడు సప్త సముద్రాల ఆవల భేతాళ గుహలో బంధిస్తే, చిత్ర విచిత్ర పోరాట విన్యాసాలతో మాంత్రికుడిపై గెలిచి, రాజ్యాధికారం, రాకుమారిని చేపట్టడం... ఈ ప్రయత్నంలో రకరకాల క్రూరమృగాలతో పోరాడటం అనేక సాహస కృత్యాలు చేయడం, విలన్ రాజనాలను మట్టికరిపించడం, ఆ సందర్భంలో పరవశించిన సామాన్య ప్రేక్షకులతో ఈలలు వేయించడం.. ఇవన్నీ జానపద కథానాయకుడు కాంతారావు అపురూప గౌరవాలు.

ఆయన పూర్తిపేరు.. తాడేపల్లి లక్ష్మీకాంతారావు. "గుంపులో గోవింద వేషం" నుంచి జానపద హీరోగా, నిర్మాతగా ఎదిగిన ఆయన చివరిదశలో చిన్నచిన్న వేషాలు వేస్తూ అటు వెండితెరలోనూ, బుల్లితెరలోనూ ప్రేక్షకుల్ని అలరించారు.

గుంపులో గోవింద వేషం
16.11. 1923లో కోదాడ యిలాకా గుడిబండ గ్రామంలో జన్మించిన కాంతారావు బాల్యంలో ఒకవైపు పౌరాణిక నాటకాలు వేస్తూ, కొంత వయస్సు వచ్చాక తెలంగాణా ప్రాంతంలో మాలీపటేల్ గిరి (ఒక విధమైన కరణీకం)చేసి సినిమాలవైపు మనసు మళ్లడంతో మద్రాసులో అడుగుపెట్టారు.

ఎడిటర్ డి.కృష్ణ సహాయంతో రోహిణివారి నిర్దోషి (1951) చిత్రంలో గుంపులో గోవిందం లాంటి వేషం వేశాడు. అయితే దేదీప్యమానంగా ప్రకాశించే అతని రూపం దర్శకుడు, తెలుగు టాకీ పితామహుడు, టాకీపులి అయిన హెచ్.ఎం.రెడ్డిని ఆకర్షించింది. వెంటనే రెడ్డి తాను తీసే జానపద చిత్రంలో కాంతారావే హీరో అని ప్రకటించారు.

ఫలితంగా సావిత్రి సరసన "ప్రతిజ్ఞ" (1953) చిత్రంలో హీరో ప్రతాప్‌గా మహోజ్వల సినీ జీవితానికి జానపద హీరోగా కాంతారావు శ్రీకారం చుట్టారు. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా గుర్రపుబగ్గీ వేగంగా వెళ్లడంతో హీరోకు చిన్న ప్రమాదం కూడా జరిగింది. ఇటువంటి ఎన్నో ప్రమాదాలను కాంతారావు ధైర్యంగా ఎదుర్కొన్నారు.

ఎన్టీఆర్ ఆదరణతో వైభవం
'ప్రతిజ్ఞ' చిత్రం విజయవంతమైనా వేషాలు రాలేదు. ఇక తిరిగి ఇంటి మొహం పడదామనుకున్న తరుణంలో కాంతారావును ఎన్టీఆర్ పిలిపించి, ఆయన నిర్మించిన 'జయసింహ' చిత్రంలో సోదరుని వేషం ఇచ్చారు. సరిగ్గా ఆ ప్రాంతంలో జానపద బ్రహ్మ విఠలాచార్య తొలిసారిగా తెలుగులో నిర్మించిన సాంఘిక చిత్రం 'కన్యాదానం'లో హీరోపాత్ర వేయించారు. అయినా కాంతారావుకు విరామం తప్పలేదు. విఠలాచార్య రూటుమార్చి కాంతారావును జానపద హీరోగా తీర్చిదిద్ది "వరలక్ష్మీ వ్రతం", కనకదుర్గపూజా మహిమ, జయవిజయ చిత్రాలు నిర్మించారు. అవి ఆ సందర్భంలో కనకవర్షం కురిపించాయి.

అప్పట్నుంచి భారీ బడ్జెట్‌తో జానపద చిత్రాలు తీసేవారికి ఎన్టీఆర్ తొలి హీరోగా కనిపిస్తే, ఆ తర్వాత స్థానాన్ని నిర్మాతల పాలిట కాంతారావు పెన్నిధిగా మారారు. ఆ కోవలో విఠలాచార్య, ఎస్. భావన్నారాయణ, పింజల సుబ్బారావు తీసిన పలు జానపదాల్లో ఆయన హీరోగా విజయభేరి మోగించారు. అవి తమిళంలోకి కూడా డబ్ కావడంతో నిర్మాతలకు లాభాలు చేకూరాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్‌తో కంచుకోట, చిక్కడు దొరకడు మొదలైన కొన్ని జానపదాల్లో సహ కథానాయకుడిగానూ కాంతారావు నటించారు.

విలన్ టచ్ పాత్రలూ చేశారు
సాంఘిక చిత్రాల ప్రసక్తికి వస్తే కథానాయకునిగా శ్రీమతి, ఆనందనిలయం వంటి కొద్ది చిత్రాలే అయినా సహకథానాయకునిగా, ఎన్టీఆర్‌తో రక్తసంబంధం, ఆప్తమిత్రులు వంటి చిత్రాల్లో నటించారు. శభాష్ రాముడు, దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాల్లో విలన్ తరహా పాత్రల్ని కూడా కాంతారావు పోషించారు. అక్కినేనితో శాంతి నివాసం, శభాష్ రాజా, బంగారు గాజులు చిత్రాల్లో కూడా విలన్ టచ్ పాత్రలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu