Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ పాత పాట మధురంలో 'అందమె ఆనందం..'

ఆ పాత పాట మధురంలో 'అందమె ఆనందం..'
అందమె ఆనందం
అందమె ఆనందం
ఆనందమే జీవిత మకరందం!

పడమట సంధ్యారాగం,
కుడి ఎడమల కుసుమపరాగం

ఒడిలో చెలి మోహన రాగం...
జీవితమే మధురానురాగం

పడిలేచే కడలి తరంగం,
వడిలో జడిసిన సారంగం

సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం!

చల్లని సాగర తీరం, మదిజిల్లను మలయ సమీరం
మదిలో కదిలే సరాగం, జీవితమే అనురాయ యోగం!!

ఈ పాట.. 1953లో తీసిన - బ్రతుకు తెరువు - అనే చిత్రంలోనిది. అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి నటించిన ఈ సినిమాలో అందమె ఆనందం - పాట తెలుగు సీమను చాలాకాలం పాటు ఉర్రూతలూగించింది. అప్పట్లో కుర్రాళ్లు, పెద్దాళ్లు తరచుగా ఈ పాటనే పాడుకోవడం ఫ్యాషన్‌గా వుండేదట. 'తెరువు' అంటే తమిళంలో వీధి, సందు అనే అర్థాలున్నాయి.

మరో పదంతోను జతచేసి తెలుగువాళ్లు తెరువును ఉపయోగించరు, బతుకుతో తప్ప. ప్రపంచంలో చాలా వైరుధ్యాలు ఉన్నట్లే రాజీపడే మనుషులు, రాజీపడని మనుషులు అని మరో రెండు రకాల వాళ్లు ఉంటారు. మనుషుల్లో రాజీ ధోరణి, నిజాలు దాచేసి అబద్ధాలతో జీవితం గడిపేసే వారి మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమే - బ్రతుకు తెరువు.

బ్రతుకు తెరువు సినిమా వచ్చింది, నాకు బతుకు తెరువు నిచ్చింది అంటూ ఈ గీత రచయిత సముద్రాల జూనియర్ చెప్పుకునే వారట. ఆయన అసలు పేరు సముద్రాల రామానుజాచార్యులు. సముద్రాల సీనియర్‌ కుమారుడే ఈ జూనియర్‌ సముద్రాల. ఆయన రాసిన మొట్టమొదటి పాటే పాపులర్‌ అయింది.

ఈ పాటలో మరో విశేషం వుంది. ఇందులో ఇద్దరు ఇంగ్లీష్‌ కవుల ప్రఖ్యాతమైన కొటేషన్లు కనిపిస్తాయి. ఇంగ్లీష్‌ కవి కీట్స్‌ రాసిన పొయెట్రీలో ఒక వాక్యం - ఎ థింగ్‌ ఆఫ్‌ బ్యూటీ ఈజ్‌ ఎ జాయ్‌ ఫర్‌ ఎవర్‌ - అనే మాటకు యథాతథంగా కాపీలా వుంటుంది - అందమె ఆనందం. ఇదే పాటలో మరో చోట జీవితమే ఒక నాటక రంగం - అనే వాక్యం వుంది. అది షేక్స్‌పియర్‌ వాడిన మాట - ఆల్‌ ద వరల్డ్‌ ఈజ్‌ ఎ స్టేజ్‌ - అనే మాటను గుర్తు చేస్తుంది.

బ్రతుకు తెరువు సినిమాకి సంగీత దర్శకుడు జె.వి.రాఘవులు అయినా అందమె ఆనందం పాటకి ట్యూన్‌ ఇచ్చింది మాత్రం ఘంటసాల గారే అంటారు. ఆయన గళంలో ఈ పాట మధురాతి మధురంగా పలికింది. పి.లీల శ్రుతి కలిపారు.

Share this Story:

Follow Webdunia telugu