ఫోర్బ్స్ జాబితాలో ఇంద్రానూయి, సోనియా..!!
ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో పెప్సికో సీఈఓ, ప్రవాస భారతీయురాలు అయిన ఇంద్రానూయి ఈసారి కూడా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. అత్యంత ప్రజాదరణ, సామర్థ్యంతో కూడిన మహిళలతో ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ ఈ సందర్భంగా ప్రకటించింది. ప్రపంచంలోని శక్తివంతమైన వంద మంది మహిళలతో కూడిన జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించింది. ఇదే జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ 13వ స్థానంలో నిలవగా... ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ మరియు ఎండీ చందా కొచార్ తొలిసారిగా 20 స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే, 99వ స్థానంలో ఉన్న బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా 91వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చితే సోనియాగాంధీ తన ర్యాంకును మరింతగా మెరుగుపరచుకుని 21వ స్థానం నుంచి ఏకంగా 13వ స్థానానికి చేరుకున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీకి సారథ్యం వహిస్తూ విజయవంతమైన నాయకురాలిగా రాణిస్తోన్న సోనియాకు 13వ స్థానాన్ని ఇవ్వటం సమంజసమని ఫోర్బ్స్ ఈ సందర్భంగా ప్రకటించింది.ఇక చందా కొచార్.. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకు అయిన ఐసీఐసీఐకి తొలి మహిళా బాస్‌గా విధులు నిర్వర్తిస్తూ, బ్యాంకును విజయపథాన నడిపిస్తున్నారని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. కాగా.. ఈ జాబితాలో మొదటి స్థానాన్ని జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ దక్కించుకోగా.. రెండో స్థానంలో ఫెడరల్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ కార్ఫ్ ఛైర్మన్ షెల్లా బ్లెయిర్ సాధించుకున్నారు.