Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డల్లాస్‌ విరాళాల విందుకు పురంధరేశ్వరి

Advertiesment
ఎన్ఆర్ఐ
FILE
భారత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి... డల్లాస్‌లో జరుగనున్న ఓ విరాళాల విందుకు హాజరుకానున్నారు. ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌‌లో తెలుగు భాషా బోధన కోసం నిధులు సేకరించే నిమిత్తం ఈ విందు సెప్టెంబర్ 26వ తేదీన జరుగనుంది.

ఈ విందు సమావేశానికి హాజరు కావాల్సిందిగా తాము పంపిన ఆహ్వానానికి పురంధరేశ్వరి సహృదయంతో అంగీకరించారని...ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రెసిడెంట్ (ఎలెక్ట్) ప్రసాద్ తోటకూర ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా... టెక్సాస్ వర్సిటీలో తెలుగు భాషా బోధనా కోర్సును రెండు సంవత్సరాల క్రితమే తానా ప్రారంభించిన సంగతి పాఠకులకు తెలిసిందే.

ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ... యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో ప్రస్తుతం 30 మందికి పైగా విద్యార్థులు తెలుగు భాష కోర్సులో శిక్షణ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందులోనూ అమెరికాకు చెందిన విద్యార్థులతో పాటు తెలుగు వారసత్వానికి ఎలాంటి సంబంధం లేని ఇతరులు కూడా తెలుగు భాష కోర్సు చేస్తుండడం విశేషం అన్నారు.

ఈ కోర్సులో చేరే విద్యార్థులకు తెలుగును సులభంగా చదవడం, రాయడం, మాట్లాడడం... తదితర విషయాలలో యూనివర్సిటీ అధ్యాపకులు చాలా చక్కటి శిక్షణను అందిస్తున్నారని ప్రసాద్ తోటకూర సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఈ విందు సమావేశంలో పాల్గొని ఓ మంచి కార్యక్రమానికి మద్ధతివ్వాలని కోరుకునేవారు తనను 817-300-4747 అనే ఫోన్ నెంబర్‌లోగానీ... ప్రసాద్‌తోటకూర@జిమెల్.కామ్‌ అనే మెయిల్ అడ్రస్సులోగానీ సంప్రదించవచ్చునని ప్రసాద్ తోటకూర వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu